వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా రవాణాశాఖ అంతగా పట్టించుకోలేదు. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు.
- నిబంధనలు పాటించకపోతే జరిమానాల మోత
- ఓ బైక్‌కు ఏకంగా రూ.8వేలు ఫైన్ విధించారు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన చలానా
అనంతపురం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ బైక్‌ను ఆపి భారీగా జరిమానాలు విధించారు. సాయినాథ్ రెడ్డి అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్ సర్టిఫికేట్, హెల్మెట్ లేకపోవడంతో ఏకంగా రూ.8వేల జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.5వేలు, ఇన్స్యూరెన్స్ లేనందుకు రూ.2వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు రూ.వెయ్యి ఫైన్ వేశారు. ఈ స్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనదారులు జాగ్రత్త వహించాలని.. సంబంధిత డాక్యుమెంట్లను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు.
మొన్నటి వరకు కరోనా కారణంగా రవాణాశాఖ అధికారులు కూడా తనిఖీలను చేయలేకపోయారు. ఇప్పుడు కాస్త ఊరట రావడంతో వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. అంతేకాదు తనిఖీలు పెంచి మార్చి లోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలని భావిస్తున్నారట.