Weather Report of Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల ఎండలు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంటుంది? వాన ఎక్కడ పడుతుందో తెలుసుకుందాం.
వచ్చే 4 రోజులపాటూ కోస్తాంధ్రలో నైరుతీ రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా.. మధ్య బంగాళాఖాతం వరకూ ఓ ద్రోణి ఉందని చెప్పింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో నేటి (14-6-2024) నుంచి 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ, గాలి వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంటుందనీ, వాన పడే సమయంలో ఉరుములు, మెరుపులు వస్తాయని తెలిపింది.
శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పగటి వేళ కొంత ఎండ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు ఉంటాయి. ఇవాళ రోజంతా రాయలసీమలో మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 తర్వాత హైదరాబాద్, ఆ చుట్టుపక్కల వాన పడుతుంది. క్రమంగా ఇది పెద్దదవుతుంది. మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. సాయంత్రం 4 తర్వాత తెలంగాణతోపాటూ.. కోస్తా, ఉత్తరాంధ్రలోనూ వాన పడుతుంది. రాత్రి 7 వరకూ ఈ వానలు పడతాయి. ఆ తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాలు ఉంటాయి.
గాలి వేగం చూస్తే.. తెలంగాణలో గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లు, ఏపీలో గంటకు 11 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉత్తరాంధ్రలో కంటే, రాయలసీమలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతంలో గంటకు 22 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో పగటివేళ మాగ్జిమం 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మాగ్జిమం 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తీరప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో మేఘాల వల్ల ఉక్కపోత కూడా ఉంటుంది.
ఇవాళ తేమ బాగా ఉంది. ఏపీలో 51 శాతం, తెలంగాణలో 60 శాతం ఉంది. అందువల్ల పనులకు బయటకు వెళ్లాలి అనుకునేవారు.. మధ్యాహ్నం లోపే పని ముగించుకోవడం మేలు. మధ్యాహ్నం తర్వాత వానలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (All Images credit - IMD)