ఆస్ట్రేలియా అనుకున్నది సాధించింది. ఒక్కసారి కాదు రెండుసార్లు లక్షకు పైగా అభిమానులున్న మోదీ స్టేడియాన్ని మూగబోయేలా చేసింది.
మొదట కోహ్లీని అవుట్ చేసినప్పుడు నిశ్శబ్దంగా మారిన స్టేడియం, తర్వాత ఆస్ట్రేలియాకు ఇక గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో మరోసారి మిన్నకుండిపోయింది.
ఆసీస్ చేతిలో 2003 వరల్డ్ కప్ ఫైనల్ ఫలితమే ఇప్పుడు కూడా పునరావృతం అయింది.
అప్పుడు రికీ పాంటింగ్ ఫైనల్ మ్యాచ్ హీరోగా నిలవగా, ఇప్పుడు ఆ స్థానాన్ని ట్రావిస్ హెడ్ తీసుకున్నాడు.
ట్రావిస్ హెడ్ అద్భుత బ్యాటింగ్‌తోపాటు ఇంకా చాలా కారణాలు భారత్‌ను మరోసారి రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది.
కఠిన లక్ష్యాన్ని నిర్దేశించలేకపోవడం
ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో ఫైనల్ గెలవాలంటే కచ్చితంగా పోరాడే లక్ష్యాన్ని విధించాల్సి ఉంటుంది.
కానీ, భారత్ ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మామూలుగా తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 243 పరుగులుగా ఉంది. అత్యధిక తొలి ఇన్నింగ్స్ స్కోరు 365 పరుగులు. అయితే తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు కన్నా తక్కువగా భారత్ 240 పరుగులే చేసింది.
ఫైనల్లో చెలరేగి ఆడే రికార్డు ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఈ లక్ష్యం చిన్నదైపోయింది.
ఒత్తిడి
వరల్డ్ కప్‌లాంటి ప్రతిష్టాత్మక టైటిల్‌ను అందుకోవడంలో బౌలర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.
పరుగుల నియంత్రణ కోసం కాకుండా, అవతలి వైపు బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నప్పుడే వికెట్లు తీయడం కీలకం.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు అదే పని చేశారు.
మొదట గిల్‌ను తర్వాత దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)ను అవుట్ చేసి భారత్‌పై ఒత్తిడి తెచ్చారు.
తర్వాత శ్రేయస్ అయ్యర్ (4)ను అవుట్ చేసి పరుగులు రాకుండా చేశారు. కోహ్లీ, రాహుల్ చెలరేగి ఆడకుండా కట్టడి చేశారు.
భారత ఇన్నింగ్స్‌లో ఒక దశలో దాదాపు 97 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా రాలేదంటే ఆస్ట్రేలియా బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత్‌పై ఎంత ఒత్తిడి పెంచిందో అర్థం చేసుకోవచ్చు.
హార్దిక్ పాండ్యా లేకపోవడం
మ్యాచ్‌లో ఆరో నంబర్ ఆటగాడి స్థానంలో హార్దిక్ పాండ్యా సేవల్ని జట్టు కోల్పోయింది.
అతని స్థానంలో ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. జట్టు స్కోరు 148/4 వద్ద క్రీజులోకి వచ్చిన జడేజా 9 పరుగులే చేసి అవుటయ్యాడు.
స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది.
ఇలా ఓవర్ఓవర్‌కూ భారత్ తన ప్రణాళికల్ని మార్చుకునేలా చేసింది ఆస్ట్రేలియా.
అదే సమయంలో రివర్స్ స్వింగ్ రాబడుతున్న మిచెల్ స్టార్స్‌ను బరిలోకి దింపాడు కమిన్స్.
ఆ తర్వాత భారత్ రన్‌రేట్ మరింత పడిపోయింది.
ఈ మ్యాచ్‌లో మొదటగా గిల్‌ను అవుట్ చేసిన స్టార్క్, తర్వాత కేఎల్ రాహుల్‌ను పెవిలియన్ పంపి భారత్‌ను నియంత్రించాడు.
మొదట హెడ్, హాజెల్‌వుడ్, తర్వాత మ్యాక్స్‌వెల్, మార్ష్, ఆ తర్వాత స్వయంగా అతనే బౌలింగ్‌కు దిగి... దఫదఫాలుగా బౌలర్లను మార్చుతూ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోనివ్వలేదు కమిన్స్. తర్వాత వరల్డ్ క్లాస్ ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియా ఆకట్టుకుంది.
మంచు, పిచ్, టాస్
మంచు ఇక్కడ మరో ప్రధానాంశం. సాయంత్రం వేళ మంచు కురిస్తే బ్యాట్స్‌మన్‌కు పరుగులు రాబట్టడం సులభం అవుతుంది.
ఈ ఆలోచనతోనే ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచినప్పటికీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా దాదాపు సగం మ్యాచ్ గెలిచినట్లయింది.
ఆరంభంలోనే ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ తర్వాత మ్యాచ్ జరుగుతున్నకొద్దీ నిలదొక్కుకుంది.
అహ్మదాబాద్‌లో జరిగిన గత పది మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే ఆరింటిలో చేజింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ పిచ్ మీద ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు 243. భారత్ ఈ స్కోరును కూడా అందుకోలేకపోయింది. ఈ పిచ్ మీద పేసర్లు ఎక్కువ వికెట్లు తీసినప్పటికీ, స్పిన్నర్లకు బాగా సహకారం అందించింది. స్పిన్నర్లు చాలా మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేశారు.
ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్
2003లో ఆస్ట్రేలియా తరఫున 140 పరుగులు చేసి రికీ పాంటింగ్ ఫైనల్ మ్యాచ్ హీరోగా నిలిచాడు.
ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఇదే స్థాయి ఆటతీరును ప్రదర్శించాడు.
ఆస్ట్రేలియా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పుడు మ్యాచ్ భారత్ వైపు ఉన్నట్లుగా అనిపించింది.
అప్పటినుంచి పట్టుదలగా ఆడిన ట్రావిస్ హెడ్ 58 బంతుల్లో అర్ధసెంచరీ, 95 బంతుల్లో సెంచరీ చేసి తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
హెడ్‌కు తోడు మార్నస్ లబ్‌షేన్ (58 నాటౌట్) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 215 బంతుల్లో 192 పరుగులు జోడించారు.
దీంతో లక్ష్యం నెమ్మదిగా కరిగిపోయింది. భారత్ ఓటమి వైపు నడిచింది.
తేలిపోయిన భారత బౌలర్లు
టోర్నీ అంతటా ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలింగ్ దళం ఫైనల్లో పట్టును నిలుపుకోలేకపోయింది.
మొదట ప్రమాదకరంగా కనిపించిన షమీ, బుమ్రా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయారు.
ట్రావిస్ హెడ్, లబ్‌షేన్ జోడీని విడదీయడానికి తంటాలు పడ్డారు.
స్పిన్నర్లు కుల్దీప్, జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు.
సిరాజ్ కూడా ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టలేకపోయాడు.