పాము కాటు వేసేముందు మిమ్మల్ని హెచ్చరిస్తుందా?
ఆ హెచ్చరికను మనం అర్థం చేసుకుంటే, పాము కాటు నుంచి తప్పించుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.
“మనం పాములను చూసి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పాములకే మనం అంటే భయం అన్నారు” స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేదీ.
గుజరాత్ కు చెందిన ధర్మేంద్ర త్రివేదీ 38 ఏళ్లుగా జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని, సురక్షితంగా వాటిని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. పాముల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
పాముల ప్రవర్తన గురించి తెలుసుకుంటే, దాని కాటుకు గురయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని ఆయన అన్నారు.
“విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దీని ద్వారానే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేదీ కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుంది. పాము ఎదురైనప్పుడు ఏ మాత్రం భయం లేకుండా కదలకుండా ఉండిపోతే, అదే మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది” అని అన్నారు.
భారతదేశంలో పాముకాటు ప్రమాదాలు వర్షాకాలంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సమయానికి చికిత్స అందకపోతే మరణం సంభవించే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.
కాటు వేసే ముందు పాము హెచ్చరిస్తుందా?
ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
“కట్లపాము ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ ‘స్స్ స్స్.. ‘అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేయడం వంటివి చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు” అని ధర్మేంద్ర త్రివేది అన్నారు.
“కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయి" అని ఆయన అన్నారు.
పాము కాటు వేసిన తరువాత శరీరంలో ఏం జరుగుతుంది?
విషపూరిత నాలుగు పాములు గనుక కాటువేస్తే శరీరంలోని రెండు వ్యవస్థలపై ప్రభావం పడుతుందని వైద్యులు డా.హెమాంగ్ దోషీ అన్నారు.
దేశంలోని ప్రధాన నాలుగు విషపూరిత పాముల్లో కట్లపాము, నాగుపాము విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఈ పాముల విషాన్ని న్యూరోటాక్సిక్ గా పిలుస్తాం. వైపర్ జాతికి చెందిన రక్తపింజర, చిన్నపింజర పాములు కరిస్తే, వాటి విషం నేరుగా రక్తంలో కలిసిపోయి, అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది. ఈ విషాన్ని హెమటోటాక్సిక్ అని పిలుస్తాం” అని వివరించారు.
“న్యూరోటాక్సిక్ నేరుగా నాడి వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీనివలన పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెమటోటాక్సిక్ నేరుగా రక్తంలో కలిసిపోయి, అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది.
పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది.
30-45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది.
4-6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు.
పాము కాటేస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేదీ 2008లో పామును పట్టుకునే సమయంలో పాము కాటుకు గురయ్యారు.
ఆ సంఘటనను త్రివేదీ గుర్తుచేసుకున్నారు.
“పాము కోరలు ఇంజెక్షన్ లాంటివి. ఇంజెక్షన్ ను ఎలాగైతే నేరుగా కండరంలోకి, లేదా నరంలోకి, లేదంటే చర్మపు పొరర మధ్యన ఇస్తారో, అలాగే పాము విషం కూడా శరీరంలోకి మూడు విధాలుగానే ప్రవేశిస్తుంది. పాము కాటుకు గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి, సంబంధిత డాక్టర్ దగ్గరకు వెళ్లి వెంటనే చికిత్స తీసుకోవాలి. అంతేకాని మంత్రాలతో విషాన్ని తీసేస్తామని ప్రచారం చేసుకునే బాబాల దగ్గరకు వెళ్లకూడదు” అన్నారు.
“నన్ను పాము కరిచిన పది నిముషాల్లోపే నేను ఆసుపత్రిలో చేరాను. సమయానికి సరైన చికిత్స తీసుకున్నందువల్లే ప్రాణాలతో బయటపడ్డాను. అయితే, నేను తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే పాము కాటు నుంచి తప్పించుకునే వాడిని. కాటు వేయడం పాముల సహజ స్వభావం కదా” అని వివరించారు.
డా. దోషి మాట్లాడుతూ, “ప్రస్తుతం పల్లెల్లోనూ 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ పాము కాటుకు గురైతే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలి. వైద్యం కూడా అందుబాటులోనే ఉంది కాబట్టి, పాములను చంపాల్సిన అవసరం లేదు. పాముల విషానికి విరుగుడు ఇచ్చే మందులు అందుబాటులోనే ఉన్నాయి” అన్నారు.
ఏం చేయాలి?
పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు.
సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.
ఏం చేయకూడదు?
పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది.
గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది.
పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి.
సమయానికి చికిత్స అందటం ముఖ్యం...
గుజరాత్ కు చెందిన విపుల్ ఈ మధ్యనే పాము కాటుకు గురై ఆలస్యం చేయడం వలన పరిస్థితి విషమించి, ప్రాణాలు కోల్పోయాడు. అతడి సోదరుడు సాగర్ కొలీ మాట్లాడుతూ, “నా సోదరుడు 12-12.30 గంటల మధ్య పాము కాటుకు గురయ్యాడు. ఓ గంట తర్వాత గానీ మాకు అతడు కాటుకు గురయ్యాడని తెలియలేదు. శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. మేం ఆసుపత్రికి చేరుకోవడానికి రెండున్నర నుంచి మూడు గంటల సమయం పట్టింది. అప్పటికే చాలా ఆలస్యం అయింది. సరైన సమయానికి చికిత్స అంది ఉంటే నా సోదరుడు బతికే వాడు” అని అన్నారు.
గుజరాత్ లోని కైలాస్ నగర్ కు చెందిన లాలాభాయి భాటియా తన మేనల్లుడికి పాము కరిచిన ఘటన గురించి వివరించారు.
“నా మేనల్లుడు కంజీ భాటియా వయసు 19-20 ఏళ్లు ఉంటుంది. తండ్రితో కలిసి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఒకసారి దుకాణంలో చేరిన పాము భాటియాను కరిచింది. వెంటనే అతడిని తీసుకుని మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్చాం. సమయానికి చికిత్స అందడంతో అంతా మంచే జరిగింది. నాలుగైదు రోజుల్లోనే అతడు కోలుకున్నాడు. అయితే మేమొక పొరపాటు చేశాం. అతడికి తాగేందుకు మంచినీరు ఇచ్చాం. అలా ఇవ్వకూడదు. అయినప్పటికీ ప్రమాదమేమీ జరగలేదు. ఇప్పుడు అతడు సంతోషంగా ఉన్నాడు” అని ఆ అనుభవాన్ని పంచుకున్నారు.
పాము కాటుకు గురవ్వకుండా ఉండాలంటే...
పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఉండే ప్రజలు పాము కాటుకు గురై, చికిత్స తీసుకోవడం కన్నా, తగినన్ని జాగ్రత్తలు తీసుకుని, పాము కాటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలని స్నేక్ క్యాచర్ వివేక్ శర్మ అభిప్రాయపడ్డారు.
“ఇంటి బయట నిద్రించే వారు దోమతెరలను వాడాలి. ఇవి దోమలను నియంత్రించడమే కాదు, పాములు మీరు నిద్రించే చోటుకు రాకుండా కూడా ఉపయోగపడతాయి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.
అలాగే చీకటి ప్రదేశాలు, గదుల్లోకి వెళ్లేటప్పుడు చేతిలో ఫ్లాష్ లైట్ ను తీసుకుని వెళ్లాలి. ఆ వెలుగులో చుట్టూ పరిసరాలను గమనించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. మూలలు, చీకటిగా ఉన్న ప్రదేశాలను గమనించడం ముఖ్యం. అలాంటి ప్రదేశాలలో చేతులు పెట్టాల్సి వచ్చినప్పుడు చేతికి మందం ఉన్న వస్త్రాన్ని చుట్టుకోవాలి.
గార్డెన్, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు పెద్ద గమ్ బూట్స్ వినియోగించాలి. ఒకవేళ ఆ సమయంలో చేతుల్లో నుంచి ఏదైనా వస్తువు నేలపై పడితే, వెంటనే నేలపై చేయి పెట్టకుండా, కింద ఏముందో జాగ్రత్తగా పరిశీలించాలి.
ఈ జాగ్రత్తలు పాటించడానికి కొత్తగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు” అని వివేక్ శర్మ అన్నారు.
దేశంలో పాము కాటు ప్రమాదాలు...
ముంబైకు చెందిన ప్రియాంక కదం పాము కాటు ప్రమాదాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఈమె స్నేక్ బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇండియా (SHE India) ఫౌండింగ్ మెంబర్ గా కొనసాగుతున్నారు.
ఆమె మాట్లాడుతూ “పాము కాటుకు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స అందించాలి. ప్రతి క్షణమూ విలువైనదే. దురదృష్టవశాత్తూ మన దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, మందులు అందుబాటులో లేవు. ఈ కారణంగా అక్కడి సిబ్బంది బాధితులను జిల్లా ఆసుపత్రులకు తీసుకువెళ్లమని సూచిస్తారు. దూరాన ఉన్న ఆసుపత్రికి చేరుకునే సమయానికి పరిస్థితి విషమించి, వైకల్యం లేదా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి” అని అన్నారు.
“జాతీయ ఆరోగ్య పథకంలో పాముకాటుకు ఇచ్చే చికిత్సను కూడా చేర్చాలి. దీని వలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తగనన్ని నిధులు అందుతాయి. ఆసుపత్రుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, వారికి వేతనం కల్పించాలి. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పాము కాటు పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వలనప్రజల్లో పాముల పట్ల ఉన్న మూఢనమ్మకాలు తొలగి, పాము కాటుకు గురైన సందర్భంలో చికిత్స తీసుకోవాలనే స్పృహ పెరుగుతుంది” అని అన్నారు.