Trending

6/trending/recent

TTD Info: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సేవ కోసం ఉపయోగించే టన్నుల కొద్దీ పూలను వాడిపోయాక ఏం చేస్తారు?

 TTD Info: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సేవ కోసం ఉపయోగించే టన్నుల కొద్దీ పూలను వాడిపోయాక ఏం చేస్తారు?

TTD Info: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సేవ కోసం ఉపయోగించే టన్నుల కొద్దీ పూలను వాడిపోయాక ఏం చేస్తారు?


తిరుమలలో వేంకటేశ్వర స్వామి అలంకరణలు, సేవల కోసం ప్రతీరోజూ కొన్ని టన్నుల పూలను వాడుతుంటారు.

చాలా ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ఈ పూలను తెప్పిస్తుంటారు. ఇంత ఖర్చు చేసి తెచ్చిన పూలు వాడిపోయిన తరువాత ఏమవుతాయి? వాటిని ఎక్కడైనా పడేస్తారా? అనే అనుమానాలు చాలా మందికి రావొచ్చు.

కానీ, తిరుమలలో వాడేసిన పూలన్నీ పూజ గదిలో ఘుమఘుమ వాసనలు వెదజల్లే అగరుబత్తీలుగా మారతాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆధ్వర్యంలోని ఆలయాల నుంచి ఇందుకోసం వాడిన పువ్వులను సేకరిస్తారు.

వాడిన పూలను అగరుబత్తీలుగా మార్చే యూనిట్‌ను టీటీడీ రెండేళ్ల కిందట ప్రారంభించింది. వాటిని టీటీడీ ఆలయాలల్లో వాడటంతోపాటు భక్తులకు విక్రయిస్తున్నారు.

ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లు

వాడిపోయిన పూల ద్వారా టీటీడీ రెండు విభాగాల్లో అగరుబత్తీలను తయారు చేస్తోంది. అవి 100 గ్రాముల బరువు ఉండే పెర్‌ఫ్యూమ్డ్ అంటే సువాసన గల అగరుబత్తీలు, 65 గ్రాముల బరువుండే ఫ్లోరా అంటే పూల వాసన గల అగరుబత్తీలు.

ఈ రెండు కేటగిరీల కింద టీటీడీ మొత్తం ఏడు రకాల అగరుబత్తీలను మార్కెట్లో విక్రయిస్తోంది. పెర్‌ఫ్యూమ్డ్ విభాగంలో తందనాన, దివ్యపాద, అభయ హస్త పేర్లతో అగరుబత్తీలను తయారు చేస్తోంది. వాటి ధర 45 రూపాయలు. పూల వాసన విభాగంలో దివ్య దృష్టి, దివ్య సృష్టి, ఆకృష్టి, తుష్టి బ్రాండ్లు ఉన్నాయి. వీటి ధర 85 రూపాయలు.

తిరుమల ఏడు కొండలను గుర్తుకు తెచ్చేలా ఏడు బ్రాండ్ల అగరబత్తీలను తీసుకొచ్చారు. వీటిని ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయించే కౌంటర్లు, టీటీడీకి సంబంధించిన ఆలయాల్లో అమ్ముతున్నారు.

ఎలా తయారు చేస్తారు?

వాడేసిన పూలను శ్రీవెంకటేశ్వర గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రానికి టీటీడీ తరలిస్తుంది. అక్కడ ఆయా రకాల పువ్వులను సిబ్బంది వేరు చేస్తారు. ఆ తరువాత వాటిని డ్రయ్యర్‌లో ఉంచి బాగా పొడిగా అయ్యేలా చేస్తారు.

బాగా ఎండిన పూలను మెత్తటి పొడిలా చేస్తారు. ఆ మిశ్రమాన్ని మరో యంత్రం ద్వారా అగరు బత్తీలుగా తయారు చేస్తారు. పచ్చిగా ఉన్న అగరు బత్తీలను మళ్లీ డ్రయ్యర్‌లో 15 గంటలకు పైగా ఆరబెట్టిన తర్వాత, వాటిని మరో యంత్రంలో సువాసన కలిగిన ద్రవాల్లో ముంచుతారు. చివరగా మళ్లీ వాటిని ఆరబెట్టి ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు.

మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు దాదాపు 4 లక్షల అగరుబత్తీలు తయారు చేసేలా వీటిని రూపొందించారు. ఎటువంటి రసాయనాలు లేకుండా పర్యావరణహితంగా తయారు చేస్తున్నట్లు దర్శన్ ఇంటర్నేషనల్ మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు.

‘‘నాలుగు రకాలు పూలతో ఫ్లోరా బత్తీలు తయారుచేస్తారు. దివ్య దృష్టికి తామర పూలు, దివ్య సృష్టికి చామంతి పూలు, సృష్టికి రోజా పూలు ఉపయోగిస్తాం. ఆ మూడు పూలతో ఆకృష్టిని తయారు చేస్తాం.

రోజుకు టన్ను నుంచి ఒకటిన్నర టన్ను వరకు పూలు వస్తాయి. వచ్చిన పూలను రకాల వారీగా వేరు చేస్తాం. ఆ తరువాత జల్లెడలాగా ఉండే ట్రేలో వేసి డ్రైయింగ్ మిషన్‌లో పెడతాం. డ్రైయింగ్ కెపాసిటీ ఒక్కొకటి 200 కిలోలు. 12 గంటల్లో పూలన్నీ డ్రై అవుతాయి. వాటిని పౌడర్ చేస్తాం. పౌడర్ నుంచి అగరబత్తిని తయారు చేస్తాం’’ అని తెలిపారు.

ఎకో ఫ్రెండ్లీ అగరు బత్తీలు

గతంలో వృథాగా పడేస్తూ వచ్చిన పువ్వులను టీటీడీ ఇప్పుడు దర్శన్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఇలా అగరుబత్తీలుగా తయారు చేస్తోందని హరినాథరెడ్డి చెప్పారు.

వాడిపోయిన పువ్వులను ఎకో ఫ్రెండ్లీ రీసైక్లింగ్ చేయాలనే సంకల్పం, స్వామివారికి అమ్మవారికి వాడిన పువ్వులను అగరుబత్తీల్లా అందిస్తే వారి ఆశీస్సులు కూడా భక్తులకి ఉంటాయనే నమ్మకంతో వాటిని తయారు చేస్తున్నామని తెలిపారు.

ఈ అగరుబత్తీలను తిరుమల ఆలయ పరిసరాల్లోనే విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా వచ్చే లాభాలను కూడా గోసంరక్షణకే ఉపయోగించాలనే విధానం తీసుకొచ్చింది.

‘‘ఈ అగరబత్తీలన్నీ 93 శాతం ఆలయ పరిసర ప్రాంతాల్లో అంటే లడ్డూ విక్రయ కేంద్రాలు, అన్నదానం పరిసరాల్లో విక్రయిస్తున్నాం. మిగిలిన 7 శాతం మాత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజ స్వామి గుడి, కపిల తీర్థం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర మాత్రమే విక్రయిస్తున్నాం. బయట నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, దీన్ని ప్రైవేట్ పరం చేయకూడదనుకున్నాం. దీనిద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని దేశవాళీ గోవుల అభివృద్ధి కోసం ఉపయోగించాలని టీటీడీ నిర్ణయించింది’’ అని ఆయన అన్నారు.

మహిళలకు ఆర్థిక భరోసా

టీటీడీ అగరుబత్తీల తయారీ కేంద్రంలో దాదాపు 150 మంది పనిచేస్తున్నారని, వారిలో ఎక్కువ మంది మహిళలేనని ప్యాకింగ్ సెక్షన్ ఇన్‌చార్జ్ ప్రియ చెప్పారు.

టీటీడీ అగరుబత్తీల తయారీ కేంద్రంలో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నానని యశోదారాణి చెప్పారు. తామందరం ఒక కుటుంబంలా పనిచేస్తుంటామని తెలిపారు.

‘‘మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మాలాంటి మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు నెలకు రూ.13,400 వస్తుంది. ఈఎస్ఐ, పీఎఫ్ తీసేయగా11 వేలు చేతికి వస్తాయి. నేను సంవత్సరం నుంచి పని చేస్తున్నా. మా ఆయన రోజు కూలీ. ఆయనకు పని లేనప్పుడు, నేను సంపాదిస్తుండటం వల్ల మా కుటుంబం రోజువారీ ఖర్చులకు, పిల్లల ఫీజులు కట్టుకోడానికి ఉపయోగపడుతోంది. కరోనా సమయంలో పనులు దొరక్క ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఇక్కడ పనిచేయడం వల్ల కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం’’ అని అన్నారు.

ఈ అగరుబత్తీల యూనిట్ స్థాపించాలని అనుకున్నప్పుడే నిరుపేద కుటుంబాల మహిళలకు ఆర్థిక తోడ్పాడు అందించాలని నిశ్చయించుకున్నామని గో సంరక్షణశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి చెప్పారు.

‘‘టీటీడీ ఈ అగరబత్తి యూనిట్ స్థాపించాలని సంకల్పించినపుడు నిరుపేద కుటుంబాల మహిళలకు ఉపాధి కల్పించాలని అనుకున్నాం. అలాంటి వారిని ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అలా మేం 145 మంది మహిళలకు ఇక్కడ ఉద్యోగాలు అందించాం’’ అని ఆయన చెప్పారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad