అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కురవనున్న వర్షాలు వాతావరణాన్ని చల్లగా మార్చనున్నాయి. నవంబర్ 22 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ తోపాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ అకాల వర్షాలు ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి.
హైదరాబాద్ నగరంలోని ఆరు జోన్లు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు వాతావరణం ఉంటుందని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 18-20 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 30-32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
ఏపీలోనూ జోరు వానలు
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు గాలులలో సగటు సముద్ర మట్టం వద్ద నుండి ఏర్పడిన ద్రోణి శ్రీలంక నుంచి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టము నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు ఉన్న ఉపరితల అవర్తనము కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో సోమ, మంగవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తాంధ్రలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.
రాయలసీమలో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. మంగళవారం, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.