Gattipally Shivalal | చూసే వారికే లోపం.. అనుకునేవారికి అయ్యో పాపం! కానీ, తనలోని లోపాన్ని ఏనాడూ శాపంగా భావించలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించాడు శివలాల్. మరుగుజ్జుతనం శరీరానికే కానీ, మనసుకు కాదని నిరూపించాడు.
పెద్దపల్లి జిల్లా మెట్‌పల్లికి చెందిన శివలాల్ వయసు 39 ఏండ్లు. జన్యులోపంతో ఎదుగుదల ఆగిపోయింది. అయితేనేం, మానసికంగా మాత్రం ఎంతో ఎదిగాడు. దేశంలోనే శాశ్వత కార్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన తొలి మరుగుజ్జుగా రికార్డు నెలకొల్పాడు. ఆ ప్రయాణం శివలాల్ మాటల్లోనే..
చిన్నప్పటి నుంచీ పట్టుదల ఎక్కువ. నన్ను చూసి నలుగురూ నాలుగు మాటలు అనేవారు. అవేవీ నేను పట్టించుకునేవాణ్ని కాదు. బాగా చదువుకోవాలని అనుకున్నా. డిగ్రీ వరకు కష్టపడి చదివా. బీకాం పూర్తి చేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ పాసైన తొలి మరుగుజ్జు నేనే. తర్వాత హైదరాబాద్‌లోని ఓ నిర్మాణ సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా చేరాను. ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఉంటున్నా. మా ఊరికే చెందిన చిన్మయి కూడా మరుగుజ్జే. నాలాంటి వాళ్లనే పెండ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆమెను నా జీవిత భాగస్వామిగా ఎంచుకున్నా. మాకు ఒక బాబు.