నేను విన్నాను.. నేను ఉన్నాను.. చెప్పిన మాయ మాటలు విని 151 సీట్లు తీసుకొని వచ్చాము. ప్రభుత్వంపై APNGO అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వ తీరుపై ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..151 సీట్లు తీసుకొని వచ్చామని’ అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. అటువంటిదే.. ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లని విమర్శించారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు. ఈ శక్తి ముందు ఎవరైన తలవంచాల్సిందేనని బండి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.
Click Here to know Employees 71 Demands Memorandum
ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యా సాగర్ మాట్లాడుతూ 13లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు. 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని, 7 పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. డీఏ బకాయులను ఇవ్వని ఏకైక సర్కార్ ఎపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనను కొనసాగిస్తామని విద్యాసాగర్ స్పష్టం చేశారు.