పీఆర్‌సీ సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం ముగిసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని స్పష్టం చేశారు. పీఆర్‌సీపై సీఎం జగన్ తిరుపతిలో ప్రకటన చేశారు... సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని కార్యదర్శుల కమిటీ తెలిపింది. దీనిపై స్పందించిన ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలెలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ ఇచ్చామని తెలిపారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.