ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం నుంచి రాజకీయాలను వేడెక్కిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అందులో మొదటగా చెప్పుకునేది రాష్ట్ర రాజధాని అమరావతి గురించే.. ఎదుకంటే సీఎం జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చింది. అమరావతి రాజధాని ఉద్యమం మొదలైంది. మూడు రాజధానులపై సర్కారు వెనక్కి తగ్గింది కానీ ఉద్యమం మాత్రం ఆగలేదు. అమరావతిపై తాజాగా బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వెడెక్కిస్తున్న అంశం అమరావతి (Amravati). రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రాజధాను అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. అప్పటి నుంచి అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు రాజధాని కోసం వ్యవసాయ భూములను వదులుకున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Bjp National Secretary Satyakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
అలాగే, రాజధాని ఇక్కడే ఉండాలి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించిన తర్వాత పరిసర ప్రాంతాల్లో అనేక సంస్థలు వెలిశాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించడం వల్లనే దీని సరిహద్దు ప్రాంతాల్లో పలు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పేర్కొన్నారు. అలాగే, రాజధాని (Amravati) కారణంగానే అక్కడ జాతీయ రహదారులు, రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం పూనుకున్నదని తెలిపారు. ఇక రాయలసీమ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌లకు అనుగుణంగా ముందుకు సాగుతామని అన్నారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వైకాపా నేతల స్వలాభం కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శించారు. ఆ పార్టీ నేతలు దోచుకోవడానికే విశాఖను రాజధానిగా ప్రచారం చేశారని ఆరోపించారు.
అలాగే, రైతులు ఉద్యమం, వరదలు, ప్రభుత్వ తీరుపైనా సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి (Amravati) ఉండాలని చాలా కాలంగా రైతులు ఉద్యమ యాత్రలు (farmers protest) చేస్తుంటే.. సీఎం జగన్ ఇంద్ర భవనంలో ఉంటూ వేడుక చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ జాతకం త్వరలో మారిపోనుందంటూ జోస్యం చెప్పారు. ఇదిలావుండగా, రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందనేదానిపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే అమరావతి-విశాఖ-కర్నూలు మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును (3-Capital Bill) ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజాగా జరిగి అసెంబ్లీ సమావేశంలో మరో కొత్త బిల్లును తీసుకోస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీంతో రాజధాని విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగనుందనేది చర్చనీయాంశంగా ఉంది.