Fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో పంతా ఎంచుకొని అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. వారి వలలో పడిన వీరు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటిదే ఒకటి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మొబైల్ అప్లికేషన్స్ లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో మోసపోయారు.
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఓ ప్రముఖ చానల్ లో పనిచేస్తున్న యువతికి మాయ మాటలు చెప్పి మోసపోయి నగదు పోగొట్టుకుంది. ఇలా రోజుకు నగరంలో పోలీస్ స్టేషన్లలో ఏడు నుంచి ఎనిమిది ఫిర్యాదులు వస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు మొబైల్ అప్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి పలువురి నుంచి రూ. 14 లక్షలు కొల్లగొట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో ఓ చానెల్‌లో పనిచేస్తున్న యువతికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ వాట్సాప్ లింక్ వచ్చింది. మొదట దానిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆ లింక్ గురించి చెప్పాడు. ప్రస్తుతం కరోనా వేళ ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని నమ్మ బలికి.. మార్కెట్లో మొబైల్ యాప్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉందని, వాటిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించాడు. మీరు పెట్టిన డబ్బులకు రిటర్న్ ఏరోజుకారోజు ఉంటుందని తెలిపాడు.
అతని మాటలు నమ్మిన యువతి అతను చెప్పిన లింక్ ఓపెన్ చేసి తొలుత రూ. 10వేలు పెట్టుబడి పెట్టింది. వెంటనే రోజుకు రూ. వెయ్యి చొప్పున ఐదు రోజులు రిటర్న్స్ జమ చేశారు. ఇలా రిటర్న్ రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. అతడిని నమ్మింది. నాలుగు రోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసి ఎక్కువ మొత్తంలో పెడితే లాభాలు అధికంగా వస్తాయని నమ్మించారు. దాంతో ఆమె ఒకసారి రూ. 40వేలు, మరోసారి 50వేలు పెట్టింది. ఇలా విడతల వారీగా రూ. 5 లక్షలు పెట్టింది. మీకు తెలిసిన వారిని కూడా చేర్పిస్తే వారికి వచ్చే దానిలో మీకు కూడా కమీషన్ వస్తుందని చెప్పాడు. కానీ ఆమె ఎవ్వరినీ చేర్పించలేదు. ఆ తరువాత రోజు నుంచి డబ్బులు రావడం ఆగిపోయాయి. అనుమానం వచ్చి వెంటనే ఫోన్ చేసింది. వారి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఇలా నమ్మే వరకు ఫోన్లు చేసి తర్వాత ఆవ చూపి బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మరో కేసులో కార్వాన్‌కు చెందిన హేమంత్ రూ. 1.10 లక్షలు మోసపోయి పోలీసులను ఆశ్రయించారు. ఇదే తరహాలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు.
నాలుగు రోజుల వరకు రిటర్న్స్ ఇచ్చి తర్వాత మొబైల్ ను స్విచ్చాఫ్ పెట్టుకున్నారు. ఈ తరహా కేసులపై 10 రోజుల వ్యవధిలో 8 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు మొత్తం రూ. 14లక్షలు కొల్లగొట్టినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎమ్ ప్రసాద్ పేర్కొన్నారు. వారిన త్వరలో పట్టుకొని సొత్తును రికవరీ చేస్తామని తెలిపారు. ఇటువంటి వారిపై జగ్రత్తగా ఉండాలని.. కష్టపడకుండా డబ్బులు రావని.. చదువుకున్న వాళ్లు కూడా ఇలాంటి మోసాలను నమ్మడం విడ్డూరంగా ఉందన్నారు.