కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ పది, ఇంటర్ పరీక్షలకు సిద్ధమవ్వడం విద్యార్థులకు కష్టమే. ఇలాంటి సమయంలోనూ పాజిటివ్ గా ఆలోచిస్తూ ఒక పదిహేను సూత్రాలు పాటిస్తే గెలుపు మీదే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు
తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజు కేసులు, మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పది, ఇంటర్ పరీక్షలు వస్తున్నాయి. భవిష్యత్తుకు బాటలు వేసే ఈ పరీక్షలను రాస్తేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం చెబుతోంది. ఒకపక్క వైరస్ ఉద్ధృతి.. మరో పక్క పరీక్షలు.. దీంతో పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సందిగ్ధంలోనే ఉన్నారు. ఈ కష్టసమయంలో వారెలా వ్యవహరించాలి, పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి.. మానసిక స్థితి ఎలా ఉంచుకోవాలి.. తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలపై నిపుణులు ఇఛ్చిన సలహాలు ఏంటి?
1. నిర్లక్ష్యాన్ని దరి చేరనివ్వొద్దు:
ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయట పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలా జరుగుతోంది. ముఖ్యంగా ప్రతి విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అవసరం ఉంటే తప్ప బటయకి వెళ్లాలి. పరీక్షలు పూర్తి అయ్యేదాకా ఇంట్లోనే చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలి.
2. మానసికంగా బలంగా ఉండాలి:
ప్రతి విద్యార్థి మానసికంగా బలంగా ఉండాలి. భయపట్టే వార్తలు, అసత్య ప్రచారాలకు దూరంగా ఉండి. చదువు పూర్తయ్యాక రిక్రియేషన్ కోసం మంచి పుస్తాలు చదవడం.. నిపుణుల సలహాలు వింటుండడం మంచింది. వారికి ఒత్తిడి దరిచేరనీయకుండా తల్లి దండ్రులు చూసుకోవాలి. కొవిడ్ సమయంలో చిన్న చిన్న మానసిక సమస్యలొస్తున్నాయంతే. సహజంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో వ్యాధి నిరోధకశక్తి ఎక్కువ. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి.
3. అలాంటి వాటి జోలికి వెళ్లొద్దు:
కొవిడ్ తీవ్రత అన్ని వయస్సుల్లోనూ ఉంది. అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షలు అయ్యేంతవరకు పిల్లలెవరూ కొవిడ్ విషయాలు, దాని పరిణామాలు, ఇతర ఆందోళనకర అంశాలు ఏవీ చర్చకు తీసుకురాకూడదు. ప్రతికూల విషయాల వైపు వెళ్లకూడదు. మనసు స్థిమితంగా ఉండేలా చూసుకోవాలి. ఒక్క పరీక్షలు తప్ప మరేదీ వారి మదిలో ఉండకుండా చూసుకోవాలి. భయపెట్టే వార్తు అసలు వారికి చేరనివ్వొద్దు.
4. ప్రతి విద్యార్థిలోనూ సానుకూల ప్రభావం ఉండాలి:
విద్యార్థుల భవిష్యత్తు కసోమే తప్పని సరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామంటోంది ప్రభుత్వం. ఇప్పుడు ఇంటర్ పరీక్షలకు కనీసం వారం కూడా సమయం లేదు.. ఇలాంటి సమయంలో ఇతరులు చెప్పే నెగెటివ్ అంశాలను విద్యార్థులు పట్టించుకోవద్దు.. పాజిటివ్ కంటే నెగెటివ్ అంశాలు మెదడుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మనసు పక్కదారి పట్టేలా చేస్తాయి. అందుకే విద్యార్థులు నిత్యం సానుకూల భావనతో ఉండాలి.
5. మార్కుల గురించి ఆలోచించకండి:
పరీక్షలు పెడితే ఎన్ని మార్కులొస్తాయోనన్న కంగారు వదిలేయాలి. ఉన్నత చదువులకు వెళ్లడానికి ఇవి అర్హత పరీక్షల్లాంటివి. కాబట్టి మనసు పెట్టి చదవాలి. మార్కులెన్ని వచ్చినా పర్వాలేదు, వచ్చిందే రాయాలి. చదివిన విషయాల్ని బాగా గుర్తుపెట్టుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
6. 15 నిమిషాలు విరామం:
విరామం లేకుండా చదవడం కూడా మంచిది కాదు. కచ్చితంగా ప్రతి రెండు గంటలకు మధ్య 15 నిమిషాలు విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు చదివినవన్నీ గుర్తుంటాయి. మెదడు అలసటకు గురి కానివ్వదు. తద్వారా ఏకాగ్రత తప్పిపోకుండా ఉంటుంది.
7. పరీక్షలు రాశామా.. వచ్చామా:
పరీక్షలు రాశాక విద్యార్థులకు చర్చించుకోవడం అలవాటు. పరీక్ష ఎలా రాశాం.. ఆ ప్రశ్న ఇలా వచ్చింది.. దానికి సమాధానం ఏమిటనే విషయాలేవీ చర్చకు రానివ్వకపోవడం చాలా మంచిది. పొరపాటున తప్పు రాసినట్టు తెలిసినా.. పక్కవారు తప్పు చెప్పినా. ఆందోళన మొదలవుతుంది.. ఆ ప్రభావం తర్వాత పరీక్షపై పడుతుంది. అందుకే ఇంటి నుంచి వెళ్లడం, పరీక్ష రాయడం, తిరిగి ఇంటికి రావడం మాత్రమే చేయాలి.. మనసు కలత చెందే ఇతర విషయాలను దగ్గరికి రానివ్వొద్దు.
8. తనవితీరా సేద తీరడం మంచింది.
ప్రతి రోజూ 20 నిమిషాలు తనివితీరా సేద తీరితే విద్యార్థులకు మంచిది. ఇంట్లోనో, మిద్దె మీదో ఆడుకోవచ్చు. వ్యాయామం లేదా యోగా కుదరకపోతే నడక, ధ్యానం, శ్వాస వ్యాయామం, ఆధ్యాత్మిక ఆలోచనలతో మమేకం లాంటివి ఏవైనా చేయవచ్చు.
9. అనసవర మందులు అసలు వాడొద్దు:
చిన్న సమస్య వచ్చినా మందులేసుకోవడం పిల్లలకు అలవాటవుతోంది. ఒత్తిడి, అలసట ఉన్నప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. అనవసర ఆందోళనలకు మాత్రం వెళ్లొద్దు. ఒకవేళ ఎవరికైనా కొవిడ్ లక్షణాలుంటే నిర్భయంగా వైద్యుడ్ని సంప్రదించి మందులు తీసుకోవాలి, కంగారు వద్దేవద్దు.
10. ప్రతి రోజూ కనీసం 6గంటల నిద్ర:
మెదడు ప్రశాంతంగా ఉండాలన్నా, రోజువారీ ఏకాగ్రత బాగుండాలన్నా.. రోజూకు కనీసం 6 గంటలపాటు నిద్ర అవసరం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే అలసట పెరిగి చదవడం, పరీక్షలు రాయడం కష్టమవుతుంది.
11. నీరు అధిక మోతాదులో తీసుకోవాలి.
ఓ వైపు కరోనా కాటు, మరోవైపు మాడు పగిలే ఎండలు. ప్రస్తుతం భారీగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఉక్కపోత ఎక్కువ. శరీరంలో తరచూ నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. బలహీన పడకుండా విద్యార్థులు రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా చేస్తే చురుగ్గా ఉంటారు, పైగా ఏకాగ్రత కూడా బాగా పెరుగుతుంది, ఒత్తిళ్లు ఉన్నా తగ్గుతాయి.
12. పోలికలు అసలు వద్దు:
పిల్లల జ్ఞాన స్థాయిలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. చదువులో కొందరు ముందుంటారు, ఇంకొందరు వెనకుంటారు. చదువులో మెరుగ్గా ఉన్న వారిని చూసి కుంగిపోకూడదు. అసలు పోలికలు పెట్టుకుని బాధపడటమనేదే ఉండకూడదు. దీనిపై తల్లిదండ్రులు పిల్లల్లో అవగాహన పెంచాలి.
13. మొబైల్ కు ఎంత దూరం ఉంటే అంత మంచింది:
పరీక్షలయ్యేదాకా తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. వాటివల్ల ఏకాగ్రత కోల్పోడంతోపాటు చదువుపై ధ్యాస తగ్గుతుంది. ఇంట్లో ఉండేవారు కూడా ఫోన్లు తగ్గించాలి. పిల్లలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించ కుండా ఉండడం మంచింది.
14. మంచి ఆహారం తీసుకోవాలి:
ప్రస్తుతం ఎండలు మండిపడుతున్నాయి. మిడ్ వేసవిలో ఉన్నాం కాబట్టి మాంసాహారం తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తినాలి.. పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇవన్నీ మంచి శక్తినిస్తాయి. నిత్యం ఉల్లాసంగా ఉండటానికే ప్రయత్నించాలి.
15. తల్లిదండ్రులూ జాగ్రత్తలు తీసుకోవాలి:
పరీక్షల వేళ పిల్లల ఏకాగ్రతను తగ్గించే ఏపనీ ఇంట్లో ఉండకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. కొవిడ్ నేపథ్యంలో భయాలకు దూరంగా ఉండి పిల్లల్లో అవగాహన పెంచాలి. ఏ సమయంలో ఎలా ఉండాలనేది చెప్పాలి. అంతే తప్ప కంగారుపెట్టకూడదు. ఉపాధ్యాయులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కుల గురించి మరీ ఒత్తిడి తీసుకురాకూడదు. ఈ పదిహేను సూత్రాలు పాఠస్తే కరోనా బారిన పడరు.. పరీక్షల్లోనే విజేతలుగా నిలుస్తారు.