మధ్య తరగతి జీవితాన్ని గడుపుతున్న వారందరికీ ఆపత్కాలంలో పనికొచ్చేదీ, ఒక్కోసారి ఆపదల్లోకి నెట్టేదీ ఈఎంఐలే. జీతం చేతులో పడీపడగానే సగానికి పైన ఈఎంఐలో పోతుంటే ఇక నెలవారీ కుటుంబ అవసరాలు తీరేదెలాగ? ఇది నూటికి డెబ్భైశాతం మధ్యతరగతి వారి సమస్య! కానీ, ఆ మిగిలిన ముప్ఫై శాతం మంది ఇదే సమస్యను ఎలా అధిగమించి ఉంటారు? అంటే.. ఆర్థిక క్రమశిక్షణ ఒక్కటే దాని మంత్రం!పెరిగే జీతం లేదా ఆదాయంతో పాటు ఖర్చులూ పెరగడం సాధారణంగా గమనిస్తుంటాం. మన జీతాన్ని బట్టి చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులు, లోన్లు ఇస్తుంటాయి. అయితే చాలామంది ఈ క్రెడిట్ కార్డులను అతిగా వాడటం, అవసరం లేకపోయినా లోన్లు తీసుకోవడం చేస్తుంటారు. దీంతో చివరకు తమకు వచ్చే ఆదాయం కన్నా తీసుకున్న లోన్లు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికి, వాటి ఈఎంఐల చెల్లింపుకే డబ్బులు సరిపోని పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇలాంటి సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి?
EMI Tips: ఈఎంఐ చెల్లింపులు ఇంతకు మించితే మొదటికే మోసం..ఈ టిప్స్ పాటిస్తే సమస్యకు దూరం..
March 15, 2021
0
కొన్ని బ్యాంకులు సంవత్సరానికి కొంత డబ్బును ఛార్జ్ చేస్తే మరికొన్ని మాత్రం ఎలాంటి ఛార్జ్ చేయకుండా సేవలను అందిస్తాయి. క్రెడిట్ కార్డు అనేది ఒక తరహా చేబదులు లాంటిది. చేబదులును సరైన సమయానికి కడితే ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ, కట్టకపోతే మాత్రం పెనాల్టీలు తప్పవు. అతిగా జాప్యం చేయడం వల్ల అది తలకు మించిన భారమయ్యి చివరికి మ్మల్ని ఆర్థిక నేరస్థులుగా నిలబెట్టే ప్రమాదం ఉంది.
మరికొంతమంది లోన్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పర్సనల్ లోన్ కావచ్చు లేదంటే హోంలోన్, వెహికిల్ లోన్ లేదా మరే లోన్ అయినా మన స్థాయికి తగ్గట్టుగా ఉందా, దానిని తిరిగి చెల్లించే అవకాశం, స్థోమత మనకు ఉన్నాయా అని ఆలోచించడం మంచిది. కానీ చాలామంది లోన్ తీర్చడం ఎలా అనే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ముందు లోన్ తీసుకుందాం అని ఆలోచించడం వల్లే సమస్యలు మొదలవుతాయి.
అసలు నెలకు మనకు వచ్చే ఆదాయం ఎంత? అందులో ఈఐఎంలకు ఎంత కేటాయించవచ్చు అనే విషయాన్ని ముందుగా బేరీజు వేసుకుంటే క్రెడిట్ కార్డు వాడకం లేదంటే లోన్ తీసుకోవడం గురించి సరిగ్గా ఆలోచించగలరు. ఒకవేళ వచ్చే ఆదాయం కన్నా ఈఎంఐలే ఎక్కువగా ఉంటే మాత్రం అది ఎంతమాత్రం మంచిది కాదు. మీరు ఆర్థికంగా అంతకంతకు చితికిపోతారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు లేదా లోన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు అది అవసరమా ఆడంబరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు మీ చేతిలో ఫోన్ ఉన్నా కానీ క్రెడిట్ కార్డులో కొత్త ఫోన్ కొనడం. నిజానికి ఇప్పుడు ఫోన్ కొనడం అవసరమా అని ఆలోచించాలి. కొన్నిసార్లు అవసరం కన్నా అత్యవసరం అయితే కానీ క్రెడిట్ కార్డులను వాడటం లేదంటే లోన్ తీసుకోవడం చేయాలి.
మీరు తీసుకున్న లోన్, క్రెడిట్ కార్డు బిల్ ఈఎంఐ మీ ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే వెంటనే జాగ్రత్తపడటం మంచిది. ముందుగా మీరు తీసుకున్న డబ్బుతో ఏం చేశారు..? దాని వల్ల ఉపయోగం ఉందా? అని ఆలోచించండి. అదే సమయంలో ఈఐఎంలు, దానిపై పడే వడ్డీ గురించి ఆలోచించండి. అటు ఈఎంఐల మీద ఓ కన్నేసి ఉంచుతూనే మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల మీద దృష్టి పెట్టండి.
ముందుగా తీసుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్ వల్ల వస్తున్న వడ్డీ మీద దృష్టి పెట్టండి. అధిక వడ్డీ గల ఋణాలను ముందుగా తీర్చే ప్రయత్నం చేయండి. ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తించి. అందుకు తగినట్టుగా చర్యలు చేపడితే సరిపోతుంది.