మావాడు భలే తెలివైన వాడండి. ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రతి చోటా క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో ఐదంకెల జీతంతో ఉద్యోగం సంపాదించాడు. కానీ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాక ఎందుకో డల్‌గా అయ్యాడు. ఇంతా సాధించాక వాడు ఇంకా ఎందుకు దిగులుపడుతున్నాడో అర్థం కావడం లేదంటూ వెంకట్‌తో రామ్ వాపోయాడు. ఇదొక్క రామ్ సమస్యనే కాదు చాలా మందికి ఎదురవుతున్న సమస్య. పుస్తకాల్లో చదవి, పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్లే తెలివిగలవాళ్లు అనుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. పుస్తకాల్లో ఉన్నది చదవి గుర్తుపెట్టుకుని పరీక్షలో రాయడం జ్ఞాపకశక్తికి నిదర్శనం. చిక్కుముడులు విప్పడం అనేది మానసిక పరిణతికి సంబంధించింది. జ్ఞాపకశక్తి వల్ల గుర్తింపు మాత్రమే రావచ్చు. కానీ, సమయానుకూలంగా తెలివితేటలను ఉపయోగించడం వల్ల జీవితంలోనూ, కెరీర్ పరంగానూ పై స్థాయిలో ఉండవచ్చు.
అసలు ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే: మీలోని, మీచుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను గుర్తించడం, దాని వల్ల ప్రవర్తనలో కలిగే మార్పులను గమనించి తెలివిగా ప్రవర్తించడమే ఎమోషనల్ ఇంటలిజెన్స్. ఉదాహరణకు మీరు ఓ కంపెనీకి ఓనర్ అనుకుంటే మీకు ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఉంటే మీ ఉద్యోగుల ప్రవర్తనను ముందుగా అంచనా వేస్తారు, వారి క్రియేటివిటీని ఎలా వాడుకోవాలి, దాని సాయంతో కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో తెలుస్తుంది.