Edible Oil: వంట నూనెలపై కీలక అప్‌డేట్.. సామాన్యులకు భారీ ఊరట?
దేశంలోకి వంట నూనె దిగుమతులు భారీగా పెరిగాయి. పామ్ ఆయిల్ దిగుమతులు వార్షికంగా చూస్తే.. పైపైకి చేరాయి. దీని వల్ల సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంటుంది.
దేశంలో వంట నూనె ధరలు మరింత తగ్గనున్నాయా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే జరిగితే చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. దేశంలోకి ఆయిల్ దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. దీని వల్ల ధరలు తగ్గుముఖం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
దేశంలోకి పామ్ ఆయిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2022-23 మార్కెటింగ్ ఇయర్‌లో పామ్ ఆయిల్ దిగుమతులు 9.79 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు కూడా 3 మిలియన్ టన్నులకు చేరాయి. ముంబైకి చెందిన సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే సోయా ఆయిల్ దిగుమతులు మాత్రం 12 శాతం మేర తగ్గాయి. 3.68 మిలియన్ టన్నులుగా నమోదు అయ్యాయి.
ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు మొత్తంగా పైన పేర్కొన్న మార్కెటింగ్ ఇయర్‌లో 16.47 మిలియన్ టన్నులుగా నమోదు అయ్యాయి. వార్షికంగా చూస్తే వీటిల్లో 17.4 శాతం మేర పెరుగుదల కనిపించింది. ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాలను 5.5 శాతానికి తగ్గించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు దిగుమతి పన్నులు తగ్గించింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఇవే రేట్లను కొనసాగిస్తూ వచ్చింది.
గ్లోబల్ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ రేట్లు తగ్గడం, అలాగే తక్కువ దిగుమతి సుంకాలు కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా వంట నూనె ధరలు దిగి వచ్చాయి. దీని వల్ల వినియోగం కూడా పుంజుకుందని చెప్పుకోవచ్చు. అధిక దిగుమతుల కారణంగా నవంబర్ 1న వేజిటబుల్ ఆయిల్ స్టాక్ 3.3 మిలియన్ టన్నులకు చేరింది. ఏడాది కిందట ఇదే సమయంలో చూస్తే ఈ స్టాక్ 2.46 మిలియన్ టన్నులుగా ఉంది.
భారత్ ప్రధానంగా ఇండోనేసియా, మలేసియా, థాయ్ లాండ్ నుంచి పామ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. సన్ ఫ్లవర్ ఆయిల్, సోయా ఆయిల్‌ను రష్యా, ఉక్రెయిన్, అర్జెంటినా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. కాగా ఇప్పటికే డీలర్ల వద్ద ఆయిల్ స్టాక్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అధిక స్టాక్ కారణంగా ధరలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇదే జరిగితే సామాన్యులకు బెనిఫిట్ కలుగుతుంది. కాగా ప్రస్తుతం పామ్ ఆయిల్ రేటు కేజీకి రూ.100లోపే ఉందని చెప్పుకోవచ్చు.