Covid-19 Third Wave: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నరకు పైగా నమోదయ్యాయి. దీంతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. ఒమిక్రాన్ కేసులు సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కరోనావైరస్ కేసులు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్-19 సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, ఆక్సిజన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు, వైద్య నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సి చర్యలపై పలు సూచనలు చేయనున్నారు.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా విలయతాండవం చేసు్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 1,59,632 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 327 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 40,863 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,790 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 3,623 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఒమిక్రాన్ నుంచి 1409 మంది కోలుకున్నారు.