Coronavirus: కరోనా మహమ్మారి దేశంలో తీవ్రంగా విజృంభిస్తోంది. రెండేళ్లుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు కొత్త కొత్త వేరియంట్లతో అతలాకుతం చేస్తోంది. కరోనా కట్టడికి దేశం వ్యా్ప్తంగా చేపట్టిన చర్యలతో తగ్గుముఖం పట్టిన కేసులు.. ఇప్పుడు కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నాయి. ఇక తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వైద్య, పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను జనవరి 26 వరకు మూసివేయాలని ఆదేశించారు.
కోవిడ్ -19 పరీక్షలను మెరుగుపరచాలని, కోవిడ్ క్లస్టర్‌లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్థలను జనవరి 26 వరకు మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలల మూసివేతకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో థర్డ్‌వేవ్ మొదలైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక లాక్‌డౌన్ ఆంక్షలు, ఇతర చర్యలు చేపడుతుండగా, ఇప్పుడు సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇక అస్సాం రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అసోంలో కర్ఫ్యూ సమయాలు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.