అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. జీవోల వ్యవహారంపై సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల పీఆర్సీ, ఇతర అంశాలపై సీఎస్ సమీర్ శర్మ వివరణ ఇచ్చారు.
సీఎస్ మాట్లాడుతూ..‘‘రాష్ట్రంపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. రాష్ట్రానికి రూ.62వేల కోట్ల రెవెన్యూ ఉంది. కరోనా లేకపోయి ఉంటే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేది. కొవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది. గత పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఒమిక్రాన్ కారణంగా రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, సంక్షేమ పథకాలకు ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ప్రభుత్వ కర్తవ్యం. రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్సీతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా రాష్ట్ర స్వరూపమే మారిపోయింది. రాష్ట్ర పరిస్థితులు దిగజారిపోయాయి. కరోనా వేళ ఇతర రాష్ట్రాలు సంక్షేమ పథకాలు తగ్గించాయి. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ఉద్యోగులు, పింఛనర్లు అందరికీ ప్రభుత్వం న్యాయం చేసింది’’ అని సీఎస్ వివరించారు.