AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఏర్పడిన మరో అల్పపీడనం మళ్లీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మళ్లీ మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించిఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం డిసెంబర్ 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారనుంది. తరువాత వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరానికి డిసెంబర్ 4వ తేదీ నాటికి చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను ఒకసారి చూద్దాం.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో వాతావరణం పొడిగా ఉంటుంది. రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.