Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది అధికారులు మారినప్పటికీ అక్కడి పరిస్థితి మాత్రం మారడం లేదు.
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది అధికారులు మారినప్పటికీ అక్కడి పరిస్థితి మాత్రం మారడం లేదు. సుమారు ఏడాదిన్నరగా ఆలయంలో శానిటేషన్ కాంట్రాక్ట్ వివాదం కొనసాగుతోంది. అప్పట్లో ఈవోగా ఉన్న సురేష్ బాబు.. అర్హత లేని వారికి టెండర్లు అప్పగించడంపై తీవ్ర దుమారం చెలరేగింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈవివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. అమ్మవారి ఆలయంలో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్ కోసం ఇప్పటికి ఆరుసార్లు టెండర్లు పిలిచారు అధికారులు. ప్రతిసారి ఏదో ఒక కారణంతో కాంట్రాక్టర్ ఎంపిక మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో మరోసారి టెండర్లు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో పిలిచిన టెండర్లలో L 2 గా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన కేఎల్ టెక్ సంస్థకు అప్పటి ఈవో బాధ్యతలు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. దేవాదాయ శాఖ కమిషనర్ అక్షింతలు వేసింది. దీంతో మళ్లీ టెండర్లు పిలవాలని సూచించారు.
గత నెల 13న టెండర్లు ఓపెన్ చేసినప్పటికీ.. ఇంతవరకు ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఎల్ 1 గా తక్కువ ధరకు లామెక్లాన్ ఇండియా కోట్ చేసింది. అయినా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అధికారులు. ఈ క్రమంలోనే అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లపై వస్తున్న ఆరోపణలపై ఆలయ ఈవో భ్రమరాంబను టీవీ9 వివరణ కోరగా.. దీనిపై ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని.. కోర్టు నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కాంట్రాక్ట్ చేస్తున్న సంస్థకు నెలకు 24 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నట్లు ఈవో చెప్పారు. ఇదిలా ఉంటే కేఎల్ టెక్ సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు మాత్రం లబోదిబో మంటున్నారు. తమకు కార్మిక చట్టం ప్రకారం జీతాలు చెల్లించడం లేదని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ముగిసేదెప్పటికో వేచి చూడాలి.