Calcium Benefits for Body: శరీరానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం తగిన మోతాదులో అందితేనే ఎముకలు బలంగా మారతాయి. అయితే శరీరానికి రోజూ ఎంత కాల్షియం అవసరం, అసలు ఎందుకు అవసరం లాంటి ప్రశ్నల గురించి చాలా మందికి తెలియదు. అయితే.. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
కాల్షియం మన శరీరంలోని ఎముకలు, దంతాలను బలోపేతం చేయడమే కాకుండా.. కండరాల బలాన్ని, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతోపాటు హృదయ స్పందనను నియంత్రించడంలో కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. వ్యక్తి శరీరంలో కాల్షియం లోపం ఉంటే, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కండరాల తిమ్మిరి, గోర్లు బలహీనంగా ఉండటం, పీరియడ్స్ సమయంలో ఎక్కువ నొప్పి, తలనొప్పి, డిప్రెషన్, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
మన శరీరానికి రోజూ ఎంతమేర కాల్షియం అవసరమవుతుందో తప్పనిసరిగా తెలుసుకోవాలి. పురుషులు అయితే.. కనీసం 1000 నుంచి 1200 mg, మహిళలు, వృద్ధులు అయితే.. 1200 నుంచి 1500 mg, పిల్లలు అయితే.. కనీసం 1300, గరిష్టంగా 2500 mg కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కాల్షియం తీసుకోవడం ద్వారా మన పని ముగియదు, దానిని శరీరంలో పనిచేసేలా చేయడం కూడా ఎంతో అవసరం. దీనికి విటమిన్ డి అవసరం. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే మనం ఆహారంలో తీసుకునే క్యాల్షియం వృధా అవుతుంది. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి ప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మిలో కాసేపు ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కాల్షియం లోపం, అధికం రెండూ కూడా హానికరం. క్యాల్షియం అవసరానికి మించి తీసుకుంటే శరీరంలో రాళ్ల సమస్య రావచ్చు. ఇదే కాకుండా ఎముకలలో పటుత్వం తగ్గి ఎముకలు త్వరగా విరిగిపోవడం లేదా.. బలహీనపడతాయి. ఇది కాకుండా గుండె సంబంధిత సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. కావున ఎప్పటికప్పుడు కాల్షియం చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి తీసుకోవడం మంచింది. అయితే.. సప్లిమెంట్లను బలవంతంగా తీసుకోవద్దు.
సాధారణ ఆకుపచ్చ కూరగాయలు, పాలు, పెరుగు, బ్రోకలీ, బీట్రూట్, బచ్చలికూర, అరటి, సోయాబీన్, గుడ్లు, చేపలు, బాదం, జీడిపప్పు, మజ్జిగ మొదలైన వాటి నుంచి కాల్షియం పొందవచ్చు.