- పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్
పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్లస్ టూ విద్య వరకు సమగ్రంగా అవలంబించాల్సిన ప్రణాళికలు, ఆచరణ ముసాయిదాలపై కసరత్తు చేయాలని, సమగ్ర విద్యావిధానం కోసం సమష్టిగా ఆలోచించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి. రాజశేఖర్ సూచించారు. ఇటీవల జరిగిన ఇంటర్మీడియెట్ బోర్డు సమావేశంలోనూ ఈ విషయాలపై చర్చించామని గుర్తు చేశారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా ఏపీసీలు, ఆర్జేడీలు, డెప్యూటీ డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా రాజశేఖర్ పాల్గొన్నారు. ప్రస్తుతం గణాంక ఆధార వ్యవస్థ అవసరమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని అంశాలపైనా పూర్తి అవగాహన పెంచుకోవాలని డీఈవోలు, ఏపీసీలకు సూచించారు. యూడైస్ ప్లస్ నమోదులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) అమలులో భాగంగా ఒకే ప్రాంగణం లేదా 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల్లోగల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు అనుసంధానించి, తద్వారా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విషయ నిపుణులతో బోధన నిర్వహించాలన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు (ఇన్ఫ్రా) ఎ. మురళి, జగనన్న గోరుముద్ద(మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బీఎం దివాన్ మైదీన్, ఆర్ఎంఎస్ఏ డైరెక్టర్ పి. పార్వతి, పౌర గ్రంథాలయాల సంచాలకులు డా. ఎంఆర్ ప్రసన్నకుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.