రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ వారి కార్యవర్తనములు
ప్రస్తుతం: శ్రీమతి కె.వెట్రిసెల్వి, ఐ.ఎ.ఎస్.,
ఆర్.సి.నం: SS-16021/50/2021-CMO SEC-SSA, తేది:22.12.2021
విషయం: సమగ్ర శిక్షా - 'జగనన్న విద్యాకానుక' విద్యార్థుల కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట కొరకు -జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జగనన్న విద్యాకానుక' పథకం కింద స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పథకం మూడో ఏడాది అమలులో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యాకానుక' పేరుతో స్టూడెంట్ కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది.
2. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి కిట్ లో 3 జతల యూనిఫాం క్లాత్, ఒక సెట్ నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, డిక్షనరీతో పాటు బ్యాగు ఉంటాయి.
3. ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా బూట్లు సరైన సైజులో అందించేందుకు విద్యార్థుల నుంచి స్వయంగా పాద కొలతలు తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది. విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించవలసిన సూచనలు
రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్/ జిల్లా పరిషత్/ మున్సిపల్/ కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/ రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలు తీసుకోవాలి.
ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు / వ్యాయామ ఉపాధ్యాయులు / పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, స్థానిక సిబ్బంది బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు సేకరించవలసిన అవసరం లేదు.
విద్యార్థులు పాదాల కొలతలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించడమైనది. • లాగిన్ వివరాల కోసం https://cse.ap.gov.in వెబ్ సైటులో సందర్శించాలి.