- సాంకేతిక కారణాలతో నమోదుకే గంటల కొద్దీ సమయం..*
విద్యార్థుల ఆన్‌లైన్ హాజరులో తరచూ ఏర్పడుతున్న సమస్యలు.. ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథక లబ్ధి చేకూరాలంటే నవంబరు 8 నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి చేయడంతో ఆన్‌లైన్ అటెండెన్స్ నిర్వహణ కీలకంగా మారింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో 61 వేల పాఠశాలల్లోని 73 లక్షల మంది పిల్లల హాజరు వేయాలంటే సర్వర్ మొరాయిస్తోంది. దీనికితోడు సెల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం, ఈ-హాజరు యాప్‌లో సాంకేతిక సమస్యలు తలనొప్పిగా మారాయి. తీరా హాజరు వేశాక సబ్మిట్ చేసేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది. ఒక్క రోజు హాజరు నమోదు చేయకపోయినా ‘అమ్మఒడి’ రాదంటూ గతంలో ప్రైవేటు యాజమాన్యాలను ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఈ పని కోసమే ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయిస్తున్నాయి. రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉన్న ఏకోపాధ్యాయ బడుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. వీటిలో మొదట విద్యార్థుల హాజరును రిజిస్టర్‌లో నమోదు చేసుకొని, ఆ తర్వాత యాప్‌లో వేస్తున్నారు. ఏ సమస్యా లేకపోతే ఈ ప్రక్రియ అరగంటలో పూర్తవుతోంది. కానీ ఇటీవల సెక్షన్ల వారీగా నమోదు చేయాల్సి రావడం. దీనికి తోడు సాంకేతిక సమస్యల వల్ల 2 గంటల వరకు సమయం పడుతోంది. యాప్‌లో పిల్లల ఇంటి పేర్లు లేక ఐడీ నంబరు దగ్గర పెట్టుకొని, హాజరు నమోదు చేయాల్సి వస్తోంది.
త్వరలో ఇంటర్‌కు అమలు..
‘అమ్మఒడి’ పథకాన్ని ఇంటర్‌కు అమలు చేస్తున్నందున త్వరలో ఈ విద్యార్థులకూ ఆన్‌లైన్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు విద్యార్థుల డేటాపై కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తగ్గించేందుకు ప్రాథమిక, ఉన్నత, ఇంటర్‌కు వేర్వేరు సమయాలు కేటాయించాలని ఆలోచిస్తున్నారు.