Trending

6/trending/recent

NEP Schools Merging: ఇంగ్లిష్‌.. వింగ్లిష్‌

  •  6,7,8 తరగతుల్లో ఒకే మీడియం, ఒకే సెక్షన్‌
  • తెలుగు మాధ్యమం మాయం.. హఠాత్తుగా ఆంగ్లం
  • పాఠాలు అర్థం గాక విద్యార్థులు అయోమయం
  • ‘విలీనం’ కాని స్కూళ్లలో అనధికారికంగా అమలు
  • మిగిలిన ఉపాధ్యాయులు విలీనం స్కూళ్లలోకి
  • బడుల విలీనంతో ఉపాధ్యాయుల కొరత
  • అసమగ్ర విధానంతో తెరపైకి కొత్త సమస్యలు

ఒక విద్యార్థి మొన్నటి వరకు తెలుగు మీడియం చదివాడు. ఇప్పుడు హఠాత్తుగా అసలు తెలుగు మీడియమే లేదు. ఉన్నది ఒక్కటే మీడియం. అది.. ఆంగ్ల మాధ్యమం. ప్రభుత్వ పాఠశాలలోనే చదవడం తప్ప మరో మార్గం లేదు. ఇక ఉన్నది ఒక మీడియమే కాబట్టి వేరే అవకాశమే లేదు. ఉన్న ఆంగ్ల మాధ్యమం సెక్షన్‌లోనే కూర్చోవాల్సిన అనివార్య పరిస్థితి. మొన్నటి వరకూ తెలుగు.. ఒక్కసారిగా ఆంగ్లంలో బోధన అంటే అంతా అయోమయం. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ విధానాలతో విద్యార్థుల మైండ్‌ బ్లాంక్‌ అయ్యే పరిస్థితి. 6,7,8 తరగతుల్లో తెలుగు మాధ్యమం అనధికారికంగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మూడు తరగ తుల్లోనూ ఒకటే సెక్షన్‌, ఒకరే ఉపాధ్యాయుడు అని చెప్పేశారు. అయితే ఈ ఉత్తర్వులు అధికారికంగా ఎక్కడా కనిపించవు. చాపకింద నీరులా జిల్లాల్లో అమలైపోతున్నాయి. దీంతో విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. పాఠాలు అర్థం చేసుకోలేక, ఆ విషయం చెప్పలేక సతమత మయ్యే పరిస్థితి నెలకొంది. తాజాగా ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో 6,7,8 తరగతులకు ఒకటే సెక్షన్‌, ఒకరే ఉపాధ్యాయుడిగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. 

విలీనంతో అసలు సమస్య

ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో పలు సమస్యలు తలెత్తాయి. ఉపాధ్యాయుల కొరత, సరిపడా గదులు లేకపోవడం, విద్యార్థులకు పాఠశాలలు దూరం కావడం.. వంటి సమస్యలున్నాయి. దీంతో ఉపాధ్యాయుల కొరత సమస్యను పరిష్కరించేందుకు కొత్త కసరత్తు చేశారు. విలీనంతో సంబంధం లేని ఉన్నత పాఠశాలల్లోని 6,7,8 తరగతులకు ఒకటే మీడియం, ఒకరే ఉపాధ్యాయుడు అని మౌఖికంగా చెప్పేశారు. ఆ ప్రకారంగా జిల్లాల్లో కసరత్తు పూర్తిచేశారు. అంటే  ఇక్కడ ఒకటే సెక్షన్‌ పెట్టడం వల్ల మిగిలే ఉపాధ్యాయులను ప్రాథమిక తరగతులను విలీనం చేసుకునే ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు. అంటే విలీనం వల్ల ఏర్పడ్డ ఉపాధ్యాయుల కొరతను సర్దుబాటు చేసేందుకు ఇలా తెలుగు మాధ్యమాన్ని ఎత్తేస్తున్నరన్న మాట. కానీ అప్పటి వరకూ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు ఈ ఆంగ్ల పాఠాలు ఎంత వరకూ అర్థమవుతాయి? ఉపాధ్యాయులు కూడా ఆ మేరకు చెప్పగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అకస్మాత్తుగా ఇలా తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి అనివార్యంగా వెళ్లాల్సిన పరిస్థితి కల్పించడం విద్యార్థుల చదవుపైనా ప్రభావం చూపుతుంది. వారు సబ్జెక్టును క్షుణ్నంగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులకు కూడా తగిన శిక్షణ లేకుండా ఒకేసారి ఆంగ్ల మాధ్యమం చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తు, నేర్చుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు 9,10 తరగతుల్లో మాత్రం మళ్లీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు పెట్టారు. రెండు సెక్షన్లు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా సర్దుబాటు చేశారు.

ఆ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల కొరత

ఉన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో తెలుగు మాధ్యమం తీసేసి, ఆంగ్ల మాధ్యమం ఒక్కటే ఉంచడం ద్వారా మిగిలిన ఉపాధ్యాయుల్ని.. విలీనంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో వేస్తున్నారు. వాస్తవానికి విలీనంతో సంబంధం లేకుండా ఉన్న ఉన్నత పాఠశాలల్లోనే చాలా చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉంది. విలీనంలో ఉన్న ఉన్నత పాఠశాల్లోనూ ఉపాధ్యాయుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు మాధ్య మం తీసేయడం వల్ల ఉపాధ్యాయుల కొరత తీరకపోగా, ఇటు విద్యార్థులకూ పాఠాలు అర్థం కాని పరిస్థితి. మొత్తం సమగ్రంగా ఒక విధా నం అమలు చేయకుండా ఒక్కొక్క సమస్యను తీసుకుని పరిష్కారం కోసం చూడడం వల్ల.. మరో సమస్య ఎదురవుతోందని అంటున్నారు. విద్యార్థులను బలవంతంగా మెదడులోకి ఎక్కించుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

NEP Schools Merging: ఇంగ్లిష్‌.. వింగ్లిష్‌


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad