Lungs Health: చలికాలంలో తరచుగా దగ్గు, జలుబు సమస్య వేధిస్తుంటుంది. అయితే, ఈ సమస్య కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కానీ, దగ్గు ఎక్కువ కాలం కొనసాగితే?.. మందులు వాడినా మళ్లీ అదే పరిస్థితి ఎదురైతే?.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఊపిరితిత్తులకు సంబంధించి చికిత్స వెంటనే తీసుకోవాలి.
పల్మోనాలజిస్ట్ డాక్టర్ వికాస్ కుమార్ ప్రకారం.. ‘‘చాలా సార్లు ప్రజలు ఛాతీ నొప్పి, న్యుమోనియా గురించి ఫిర్యాదు చేస్తారు. తీవ్రమైన దగ్గు సమస్యతో వస్తుంటారు. అయితే, అది బ్రోన్కైటిస్ లేదా రోగిలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. కానీ చాలా కాలంగా దగ్గు విపరీతంగా ఉంటే మాత్రం ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇది క్రమంగా క్యాన్సర్‌కు దారి తీస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజల జీవనశైలిలో మార్పులే దీనికి ప్రధాన కారణం. పొగతాగడం వల్ల కూడా ఈ వ్యాధి పెరుగుతోంది. వాస్తవానికి దగ్గు సమస్యను ప్రజలు చాలా తేలికగా తీసుకుంటారు. అదే అసలు సమస్యకు కారణం. వైద్యులను సంప్రదించకుండా స్వీయ వైద్యం తీసుకోవడం వలన సమస్య మరింత జఠిలమై.. ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తుంది.’’ అని చెప్పుకొచ్చారు.
టీబీ కావొచ్చు..
ఒక వ్యక్తికి మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే అది టీబీ లక్షణం కావొచ్చు అని వైద్యులు పేర్కొన్నారు. దగ్గు సమస్య పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే టీబీ వస్తుందన్నారు. స్వీయ చిట్కాలతో తగ్గిపోతుందని భావించడం వల్ల అది కాస్తా ఎక్కువై.. టీబీగా మారుతుందన్నారు. అందుకని దగ్గు ఎక్కువ కాలం వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి..
1. కఫంలో రక్తం వచ్చినట్లయితే.
2. ఒక్కసారిగా బరువు తగ్గినట్లయితే.
3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
4. ఎప్పుడూ నీరసంగా అనిపించడం.
5. నడవడానికి ఇబ్బంది పడుతున్నా.
6. గొంతు బొంగురుపోవడం.
7. గొంతు మంట.