అమరావతి, నవంబరు 8 : పీఆర్సీని వారంలోగా తేల్చాలని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు చైర్మన్ బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో సాధారణ పరిపాలనశాఖ సర్వీసెస్ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను సీఎంకు బ్రీప్ చేసి ఉద్యోగ సంఘాలకు ఇద్దామని అనుకున్నామని, అయితే సీఎం బిజీగా ఉండడం వల్ల బుధవారం ఉదయం సీఎంకు పీఆర్సీ నివేదిక బ్రీఫ్ చేసి, అదేరోజు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు అందజేస్తామని సీఎస్ చెప్పినట్లు శశిభూషణ్‌కుమార్ తెలిపారన్నారు. బొప్పరాజు మాట్లాడుతూ.. బుధవారం నివేదిక ఇవ్వని పక్షంలో ఇరు జేఏసీల రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేయదలిచామన్నారు. జీపీఎఫ్‌లోన్లు కోట్లాది రూపాయలు, ఏపీజేఎల్‌ఐ లోన్లు, విశ్రాంత ఉద్యోగుల సరెండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి విడుదలకు కార్యాచరణ ప్రకటించాలని, లేనిపక్షంలో ఇరు జేఏసీలు తీవ్రమైన ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతామని వెల్లడించారు. ఇక, చంద్రశే ఖర్‌రెడ్డి ప్రభుత్వానికి సలహాదారు కానీ ఉద్యోగ సంఘాలకు కాదని, తమకు సీఎం జగనే బాధ్యత వహించాలని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా బొప్పరాజు తెలిపారు.
వారంలో పీఆర్సీ నివేదిక: వెంకట్రామిరెడ్డి
ఈ వారంలో పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. సోమవారం సీఎస్‌ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఒడిసా పర్యటన తర్వాత పీఆర్సీ సహా, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలను సీఎంతో చర్చిస్తామని, తర్వాత సీఎం ఆదేశానుసారం నివేదిక వెల్లడిస్తామని సీఎస్ చెప్పారన్నారు. అలాగే, ప్రొబేషన్‌పై గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు.. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందవద్దని చెప్పారు.