- మాపై ప్రేమ ఎందుకు లేదో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి
- ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి
- మా ఆందోళనను సీఎం స్థాయిలో ఆలోచించాలి: బొప్పరాజు
అమరావతి: పీఆర్సీ నివేదిక ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, సోమవారం నివేదిక ఇవ్వలేదని తెలియజేయడానికి బాధ పడుతున్నామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం ఆయన సచివాలయంలో ఉద్యోగుల సర్వీసుల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, ఉపాధ్యాయ సంఘాలన్నీ పీఆర్సీ నివేదిక వెంటనే వెల్లడించాలని.. లేదంటే సమావేశం నుంచి వెళ్తామని చెప్పినపుడు రెండు రోజుల్లో నివేదిక ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ రోజు శశిభూషణ్‌ను కలిస్తే.. పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రికి సోమవారం వివరిద్దాం అనుకున్నామని, ఆయన బీజీగా ఉన్నందున సాధ్యం కాదలేదని చెప్పారు. బుధవారం ఉదయం వివరించి, మధ్యాహ్నం అందజేస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పాలని సీఎస్ సూచించినట్లు ఆయన తెలిపారు’ అని శ్రీనివాసరావు వివరించారు.
‘నెలాఖరులోగా పీఆర్సీ నివేదికతోపాటు ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. రోజూ మేం తిరగడానికే సరిపోతుంది. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఎందుకో జాప్యం చేస్తోంది. బుధవారమైనా నివేదిక ఇస్తారని ఎదురుచూస్తున్నాం. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల’ని కోరారు.
నివేదిక రేపు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం
పీఆర్సీ నివేదిక బుధవారం ఇవ్వకపోతే గురువారం రెండు జేఏసీలు కలిసి చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘ఉద్యోగుల ఆందోళనను సీఎం స్థాయిలో గుర్తించాలి. పీఆర్సీ నివేదికను వెంటనే ఇచ్చి వారంలోగా సెటిల్ చేయాలి. ఏపీజేఏసీ పక్షాన పీఆర్సీ 55 శాతం అడిగారు. ఏపీజేఏసీ అమరావతి తరఫున 63 శాతం కోరాం. పీఆర్సీ నివేదికలో 27 శాతం ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. మేం కోరుకున్న అంకె నుంచి చర్చ మొదలవుతుంది. ఎక్కడ ఆగుతుందో చూడాలి. మా డిమాండ్ నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. 2018 జులై 1 నుంచి ఒక్కరోజూ దాటినా ఒప్పుకోం. డబ్బు ఎప్పటినుంచి చెల్లిస్తారనేది ప్రభుత్వంతో చర్చల సందర్భంగా తేలుతుంది. పదవీ విరమణ చేశాకే బెనిఫిట్స్ ఇస్తామన్నా అంగీకరించమ’ని స్పష్టంచేశారు. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపైనా ఈ వారంలోనే సమావేశమై జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలు, రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్, ఇతరత్రా కోట్లాది రూపాయల విడుదలపై ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి, లేదంటే ఆందోళనకు సిద్ధమవుతామని పేర్కొన్నారు. ‘ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి సలహాదారు తప్ప, మాకు కాదు. ఆయన సేవలు ఎలా వాడుకుంటుందో ప్రభుత్వ ఇష్టం. మాకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి’ అని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.
ఈ వారంలోనే నివేదిక: కె.వెంకట్రామిరెడ్డి
పీఆర్సీ నివేదిక ఈ వారంలోనే ఇస్తామని సీఎస్ చెప్పారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘పీఆర్సీ నివేదికపై సీఎస్‌ను అడగ్గా.. జేఎస్సీ భేటీ తర్వాత ఎక్కువగా సెలవులు రావడంతో సమావేశం మినిట్స్ సీఎం దృష్టికి తీసుకెళ్లలేదు, బుధ, గురువారాల్లో సీఎంతో చర్చిస్తామని సీఎస్ చెప్పార’ని తెలిపారు.