పెట్రోల్.. డీజిల్, కూరగాయలు, నిత్యావసరాలు, వంట గ్యాస్ రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో అల్లాడిపోతున్న సామాన్యలకు స్వల్ప ఊరట కలిగించే వార్త ఇది. డిసెంబరు 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గే చాన్స్ కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో.. గ్యాస్ ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతి నెల రివ్యూ చేసి.. కొత్త ధరలను అనౌన్స్ చేస్తాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం.. ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతోన్న వేళ… క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. 2020 ఏప్రిల్ స్థాయికి చేరాయి. ఈ శుక్రవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ 10 డాలర్లకు చేరింది. ఈ ఎఫెక్ట్‌తో ఆయిల్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరను డిసెంబరు నుంచి తగ్గించనున్నాయని తెలుస్తోంది.
కరోనా వేళ జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. పేద, మధ్యతరగతి వర్గాల వ్యధలు అయితే వర్ణించ వీలులేనివి. ఉపాధి కోల్పోయి.. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైరస్ కారణంగా చాలామంది మృత్యువాతపడ్డారు. వైరస్‌కు వ్యాక్సిన్స్ వచ్చి.. వ్యాప్తి కాస్త తగ్గింది అని భావిస్తోన్న వేళ.. సామాన్యులపై భారీగా ధరలు భారం పడింది. పెట్రోల్, డీజిల్ అయితే సెంచరీ దాటి పరుగులు తీస్తున్నాయి. కూరగాయల రేట్లు మంట పుట్టిస్తున్నాయి. ఏదీ కొనేటట్టు లేదు.. ఏదీ తినేటట్టు లేదు. ఈ క్రమంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుని ధరల పెరుగుదలపై నియంత్రణ విధించి, సామాన్యులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.