AP Govt. Employees PRC Fight: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ సమర శంఖం పూరిస్తున్నారు. PRC అమలుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల సమస్యల విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి ఉద్యోగ సంఘాలు. విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తోందని స్పష్టం చేశాయి.. PRC సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. యాక్షన్ ప్లాన్ ప్రకటించాయి. డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపాయి. విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యమబాట పట్టాల్సి వస్తోందని స్పష్టం చేశాయి. PRC ప్రకటన, CPS రద్దు, ఉద్యోగుల బకాయిలపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
ప్లాన్ ఆఫ్ యాక్షన్‌పై డిసెంబర్1న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 7 నుంచి 10 వరకు అయా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నారు. 10న భోజన విరామ సమయంలో నిరసన ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. డిసెంబర్13, 16వ తేదీల్లో అన్ని తాలుకా కేంద్రాల్లో నిరసనలు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. 21న అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నా ఉంటుంది. 27న విశాఖ, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు, జనవరి 6న ఒంగోలులో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
PRC ప్రకటన, CPS రద్దు, ఉద్యోగుల బకాయిలు. ఈ మూడు డిమాండ్స్‌ను ప్రధానంగా తెరపైకి తెచ్చాయి ఎంప్లాయిస్ యూనియన్స్. PRCపై విధించిన డెడ్‌లైన్ ముగియడంతో AP JAC, AP JAC అవరావతి ఉమ్మడి సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. PRC నివేదికను బయటపెట్టడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చేస్తున్నారని.. ఆర్థిక మంత్రి కూడా అవమానించే విధంగా మాట్లాడారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని.. అయినా తమపై ఈ విధంగా కక్ష కడుతున్నారని ఆరోపించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముగిసేలోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.