- ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి
- గత నాలుగునెలల్లో మూడో మెమో
న్యూస్ టోన్, అమరావతి: ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ మరో జీవో విడుదల చేసింది. కరోనా తగ్గుముఖం పట్టిన గత నాలుగు నెలల్లోనే ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం జీవో ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గ్రామ/వార్డు సచివాలయం నుంచి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ సమయానికి రావాల్సిందే. డ్యూటీ సరిగ్గా చేయాల్సిందే. అయితే పదేపదే జీవోలిస్తున్న తీరే ఉద్యోగుల్లో అనుమానాలు పెంచుతోంది. వేతనాలకు బయోమెట్రిక్‌తో ముడిపెట్టి ఇబ్బందులకు గురిచేస్తారేమోనని కలవరపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులకు సమయానికి హాజరవుతున్నారోలేదో గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం విడుదల చేసిన ఆ జీవోలో సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది.
ఉద్యోగులందరూ కార్యాలయాల్లో ఉండేలా చూసే బాధ్యత కార్యదర్శులదేనని స్పష్టం చేసింది. దీనిపై వారానికోసారి సమీక్ష చేయాలని, గైర్హాజరు కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని హెచ్‌వోడీలు, కలెక్టర్లను ఆదేశించింది. హాజరు నమోదు వివరాలను సంబంధిత శాఖల కార్యదర్శులు పరిశీలించాలని, 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్లు తెలిపింది. సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.