- కొనసాగుతామంటున్న యాజమాన్యాలు
- ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటామంటున్న ఉపాధ్యాయులు
ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడదల చేయడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చినట్లయింది. ప్రభుత్వం తొలిగా విధించిన నిబంధనల మేరకు విలీనం చేసే ప్రక్రియపై వివిధ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు సైతం రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానం కూడా బలవంతపు విలీన చర్యలు సరికాదని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పటివరకు నిర్వహించిన ప్రక్రియను రద్దుచేసి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ దిశగా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం తొలిగా ఇచ్చిన ఆదేశాలతో జిలావ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో పలు యాజమాన్యాలు తామే అన్‌ఎయిడెగా నిర్వహించుకుంటామని విద్యాశాఖకు నివేదించాయి. గత మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఉన్న 413 ఎయిడెడ్ పాఠశాలల్లో 335 పాఠశాలల యాజమాన్యాలు తమ ఉపాధ్యాయులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించాయి. వాటిలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 290కిపైగా బడులను ఎయిడెడ్‌నుంచి మార్పు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
వివిధ సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత పద్ధతిలోనే యథావిధిగా నిర్వహించుకోవడం, ఇప్పటికే సానుకూలత తెలిపినా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటే తిరిగి అన్‌విల్లింగ్ ఇవ్వడం ఇలా నాలుగు ఐచ్ఛికాలు ఇచ్చింది. దీంతో జిల్లాలో ఇంతకుముందు అన్‌ఎయిడెడ్‌గా తామే నిర్వహించుకుంటామని సానుకూలత వ్యక్తం చేసిన యాజమాన్యాల్లో ఎక్కువ శాతం వరకు తిరిగి ఎయిడెడ్‌గా కొనసాగుతామని చెబుతూ విద్యాశాఖకు తమ ఐచ్ఛికాన్ని చెప్పడంతో ఎయిడెడ్ విలీన ప్రక్రియ కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.
ఎన్నికల కోడ్‌తో..
ఇప్పటికే జిల్లాలోని వివిధ ఎయిడెడ్ పాఠశాలలనుంచి దాదాపు 1100మంది ఉపాధ్యాయులను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి సర్దుబాటు చేస్తారనుకుంటున్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఆయా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. తమ యాజమాన్యాలు తిరిగి ఎయిడెడ్‌గానే కొనసాగుతామని చెప్పడంతో వారంతా వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అధికారులు ఉంటున్నారు. చాలామంది ఉపాధ్యాయులు అందుకు అనుకూలంగా లేరు. ఇప్పటికే ఓ క్రిస్టియన్‌సంస్థ నిర్వహించే ఎయిడెడ్ పాఠశాలకు చెందిన 100మందికి ఉపాధ్యాయులు తాము ప్రభుత్వ పాఠశాలల్లోనే పనిచేస్తాం, దానికి అంగీకరించాలని కోరుతూ సంస్థ బిషప్‌ను కోరినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
సమ్మతి తీసుకోవాలి
తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో ప్రభుత్వంలో విలీనం కావడానికి అంగీకరించిన ఎయిడెడ్ యాజమాన్యాల్లో చాలామంది తమ సమ్మతిని వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో ౖగురువులను కూడా వెనక్కి పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ విషయంలో ఉపాధ్యాయుల సమ్మతిని కూడా తీసుకోవాలని సంఘ పరంగా డిమాండ్ చేస్తున్నాం.
తమ్ము నాగరాజు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
త్వరలోనే మార్గదర్శకాలు
ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం యాజమాన్యాల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ఉపాధ్యాయులు తిరిగి తమ పాఠశాలలకు వెళ్లే అంశంపై నెలకొన్న సమస్యలను ఆయా సంఘాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై రెండు మూడు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి