Ivermectin, Doxycycline: అత్యవసరమైతే తప్ప సీటీ స్కాన్ వద్దు.. కోవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్‌ తొలగించిన కేంద్రం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Drop Ivermectin, Doxycycline from Covid Treatment: కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

సాధారణ లక్షణాలు, లేదా లక్షణాలు లేని కోవిడ్‌ బాధితులకు ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్‌ వంటి ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీహెచ్‌ఎస్‌ కరోనా చికిత్స మార్గదర్శకాలను సవరించింది. అంతేగాక, అత్యవసరమైతే తప్ప సీటీ స్కాన్లు చేయొద్దని స్పష్టం చేసింది.

కోవిడ్ బాధితులకు ఔషధాలు సూచించేప్పుడు వైద్యులు చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని, సీటీ స్కాన్లు వంటి అనవసర టెస్టులు కూడా తగ్గించాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మోస్తరు లక్షణాలు లేదా లక్షణాలు లేని కరోనా బాధితులకు ఐవర్‌మెక్టిన్‌తో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్‌, డాక్సీసైక్లిన్‌, జింక్‌, మల్టీవిటమిన్‌ వంటి ఔషధాలను చికిత్స నుంచి తొలగిస్తున్నట్లు డీజీహెచ్‌ఎస్‌ స్పష్టం చేసింది. కేవలం జ్వరానికి యాంటీపైరెటిక్‌, జలుబు వంటి లక్షణాలకు యాంటీటస్సివ్‌ మాత్రమే ఇవ్వాలని సూచించింది.

కరోనా వైరస్ బారినపడినవారికి ఇతర వ్యాధులు, ఆరోగ్యపరమైన సమస్యులుంటే మాత్రం వైద్యుల సూచన మేరకు కోవిడ్‌ ఔషధాలు తీసుకోవాలని సూచించింది. ఇక, సాధారణ లక్షణాలున్నవారు ఎప్పటికప్పుడు జ్వరం, ఆక్సిజన్‌ స్థాయిలు చూసుకోవాలని తెలిపింది. జ్వరానికి యాంటీపైరెటిక్‌ మందులు వాడుతూ ఆవిరి పట్టాలని సూచించింది. లక్షణాలు తీవ్రమైతే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని స్పష్టం చేసింది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖంపట్టాయి. అయినప్పటికీ ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదని కేంద్ర స్పష్టం చేసింది. ప్రతి కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్‌లు పెట్టుకోవడం, భౌతిక దూరం వంటివి మరవొద్దని ఆరోగ్యశాఖ మరోసారి గుర్తుచేసింది. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది. కోవిడ్‌తో బాధపడుతున్నవారు ఆరోగ్యకర సమతుల్య ఆహారంతో పాటు మంచినీరు ఎక్కువగా తాగాలని డీజీహెచ్‌ఎస్‌ మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఐవర్‌మెక్టిన్‌ ఔషధంపై గత కొన్నిరోజులుగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఔషధం తీసుకున్నవారిలో మరణాలు తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. అయితే, ఐవర్‌మెక్టిన్‌ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని మాత్రం పేర్కొనలేదు. పైగా దీని వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉండొచ్చని హెచ్చరించడం గమనార్హం.



Below Post Ad


Post a Comment

0 Comments