Bank Services At Door step: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలపై ఎంత ప్రభావం చూపుతుందో.. ఆర్థిక వ్యవస్థపై కూడా అదే స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలుగుతుంది. బ్యాంకుకు వెళ్లడానికి ఖాతాదారులు జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకుకు రాలేని ఖాతాదారుల వద్దకే బ్యాంకింగ్ సేవలను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఇందు కోసం కొత్త కంపెనీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఏర్పడ్డ విఘాతానికి చెక్ పెట్టేందుకు ఎస్బీ అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నూతన కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీ కస్టమర్ల ఇళ్ల వద్దకే బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లేందుకు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) కింద బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సేవలను వినియోగించుకుంటుంది. నూతన కంపెనీకి ఎస్బీఐ మాజీ సీజీఎం, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంక్ డిప్యూటీ సీఈఓ రాజీందర్ మిరాఖర్ సీఈఓగా నియమితులయ్యారు. దీని ద్వారా చెక్ పికప్, అకౌంట్ స్టేట్మెంట్ల రిక్వెస్టులు, పే ఆర్డర్ల డెలివరీ వంటి 11 ఆర్థికేతర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతటితో ఆగకుండా.. నగదు విత్ డ్రాయల్స్ సదుపాయాన్ని కూడా ఖాతాదారుల ఇంటి ముంగిటకే తీసుకురానున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కస్టమర్లు తమ ఇంటి ముందే బ్యాంకింగ్ సేవలను పొందేందుకు వెబ్, మొబైల్ యాప్ లతో పాటు ఫోన్ ద్వారా రిక్వెస్ట్ పంపవచ్చు.