Andhra Pradesh RRR: పిటిషన్ వేసి మరీ తిట్టించుకుంది ఏపీ ప్రభుత్వం.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కస్టడీలో సీఐడీ పోలీసులు తనను కొట్టారని ఎంపీ ఫిర్యాదుతో.. ఈ విషయం దేశంలోనే సంచలనంగా మారింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో దీనికి సంబంధించిన కేసు నడుస్తోంది. అయితే మరో వైపు ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. పిటిషన్ వేసి మరి తిట్లు తిట్టించుకుంటోంది ఏపీ ప్రభుత్వం. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
మధ్యాహ్నం 12 గంటలకు వైద్య నివేదిక ఇవ్వాలని చెప్పినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వం తరపు న్యాయ వాదులను ప్రశ్నించింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు నర్సాపురం రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీఐపీ స్పెషల్ రూములో ఆర్మీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రఘురామకు అయిన గాయాలపై నిన్ననిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలోనే ఉంటారు.
ప్రస్తుతం సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామకు రెండో రోజు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం వైద్య పరీక్షలను విడియోగ్రఫీ చేస్తున్నారు.