Teacher Died in Election Duty: వరంగల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మెతుకు రమేష్ బాబు పనిచేస్తున్నారు. అయితే, ఎన్నికల విధుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 57వ డివిజన్‌లోని సమ్మయ్య నగర్‌లో పోలింగ్ బూత్ కేటాయించారు. శుక్రవారం ఉదయం పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా చాతీలో నొప్పి రావడంతో తోటి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంతలోపే గుండెపోటు రావడంతో రమేష్ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఇదే విషయాన్ని వైద్యులు నిర్దారించారు.
కాగా, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక్కడ 6,53,240 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉదయం11 గంటల వరకు 23.62 శాతం పోలింగ్ నమోదయింది.