Coronavirus updates: దేశంలో రోజూ 25వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. అందువల్ల కేంద్రం అప్రమత్తం అవుతోంది. 17న సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కీలకం కాబోతోంది.
ఇండియాలో కరోనా ఏ రేంజ్‌లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది. ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా... మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్లు ప్రకటించమని సూచించే అవకాశాలు ఉన్నాయి.
ఇండియాలో కొత్తగా 26,291 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కి చేరింది. కొత్తగా 118 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,58,725కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 17,455 మంది కరోనా నుంచి కోలుకోగా... మొత్తం రికవరీల సంఖ్య 1,10,07,352కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.7 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,19,262 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో కొత్తగా 7,03,772 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 22,74,07,413కి చేరింది.
ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో 78 శాతం కొత్త కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కాస్త కేసులు పెరుగుతున్నాయి. కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. కరీంనగర్ లోని రెండు స్కూల్లో ముగ్గురు టీచర్లు, ఓ విద్యార్థికి కరోనా సోకింది. మంచిర్యాలలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 12 మంది టీచర్లు, ఇద్దరు మధ్యాహ్నం భోజనం వడ్డించేవారు, ఓ విద్యార్థికి (మొత్తం 15 మంది) కరోనా సోకింది. టీటీడీ వేద పాఠశాలలో పది మంది విద్యార్థులకు కరోనా సోకింది.
ఇక త్వరలో సూదితో పని లేకుండా ఇచ్చే వ్యాక్సిన్లు కూడా రాబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ సంవత్సరం చివరి నాటికి అవి వస్తాయి అంది. అటు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు... ఆక్స్‌ఫర్డ్ ఆస్త్రాజెనెకా సృష్టించిన... ఇండియాలోని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి తాత్కాలికంగా బ్రేక్ వేశాయి. ఇప్పటికే పది ఐరోపా దేశాలు, థాయిలాండ్ ఈ టీకాను తాత్కాలికంగా నిలిపాయి. ఇది ఇచ్చిన వారికి రక్తం గడ్డ కడుతోందనే ఆందోళనలు వస్తున్నాయి. ఇండియాలో మాత్రం ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. తమ వ్యాక్సిన్ మంచిది అనీ... ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ రాలేదని ఆస్త్రాజెనెకా తెలిపింది.
తెలంగాణలో కొత్తగా 157 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. కొత్తగా ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1654కి చేరింది. మరణాల రేటు 0.54 శాతం ఉంది. తాజాగా 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,97,681కి చేరింది. రికవరీ రేటు రాష్ట్రంలో 98.79 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు 10 తగ్గాయి. ప్రభుత్వం తాజాగా 38,517 టెస్టులు చేయించింది. మొత్తం టెస్టుల సంఖ్య 92,38,982కి చేరింది. GHMC పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 22,604 టెస్టులు చెయ్యగా 147 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 8,92,008కి చేరింది. కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7185కి చేరింది. కొత్తగా 10 మంది పూర్తిగా కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,83,380కి చేరింది. యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1443 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,57,366 కరోనా టెస్టులు చేశారు.
ప్రపంచ దేశాల్లో కొత్తగా 3,26,688 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12.07 కోట్లు దాటింది. కొత్తగా 6330 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 26.71 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.
అమెరికాలో కొత్తగా 43,667 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3.01 కోట్లు దాటింది. కొత్తగా 763 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 5.47 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ అమెరికా టాప్‌కి వెళ్లగా.... బ్రెజిల్, ఇండియా, టర్కీ, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త మరణాల్లో బ్రెజిల్ (1,275) టాప్‌లో ఉంది. ఆ తర్వాత అమెరికా (763), రష్యా (404), ఇటలీ (354), ఫ్రాన్స్ (333) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.