Lok Sabha Elections 2024: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. రాజకీయ పార్టీలతోపాటు దేశ ప్రజలంతా ఎన్నికల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్, తేదీని ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. 15 నుంచి 20 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీని ఈసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘం రాబోయే 15- 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ అధికారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు.
జమ్మూకశ్మీర్ ఎలక్షన్ చీఫ్ చెప్పడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని మరికొన్ని నివేదికలు కూడా పేర్కొన్నాయి. మార్చి 13 నాటికి భారత ఎన్నికల సంఘం రాష్ట్రాలలో తన అంచనాను పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఈసీఐ త్వరలో ప్రకటించనుంది.