The Diary of a CEO | ఈ 14 సూత్రాలు పాటిస్తే మీ లైఫ్‌కి మీరే బాస్ అవ్వొచ్చు!
The Diary of a CEO | స్టీఫెన్ బార్ట్‌లెట్.. ఉబెర్, ఆపిల్, టిక్‌టాక్, కోకకోలా, అమెజాన్.. తదితర సంస్థలకు మార్కెటింగ్ గురువు. ఆయన సీఈవోగా, వ్యవస్థాపకుడిగా, బోర్డ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీల మొత్తం టర్నోవర్ బిలియన్ డాలర్ల పైమాటే. ‘ఫ్లయిట్ స్టోరీ’ పేరుతో ఓ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా నడుపుతున్నారు. గత నాలుగేండ్లుగా ప్రపంచంలో అత్యంత విజయవంతులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన దగ్గర ఏడువందల గంటల రికార్డింగ్ ఉంది. ఆ అనుభవ సారమే ‘ద డైరీ ఆఫ్ ఎ సీఈవో’. అందులోని జీవిత, వ్యాపార విజయ రహస్యాలకు సంక్షిప్త రూపమే ఈ వ్యాసం.
ఇందులో వ్యూహాలు ఉండవు. నిజానికి స్ట్రాటజీ జీవితకాలం అతి తక్కువ. ఒకసారి పనిచేసిన వ్యూహం మరో సందర్భంలో బెడిసికొట్టవచ్చు. ఇదొక జీవిత సత్యాల సమాహారం. కుటుంబం నుంచి ప్రపంచం వరకు.. దేనికైనా అన్వయించుకోవచ్చు. మీరు కార్పొరేట్ లీడర్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేటరూ కావచ్చు. సామాన్యుడు కావచ్చు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కావచ్చు. ఈ సూత్రాల్ని ఎవరైనా అనుసరించవచ్చు. మీకంటూ ఓ కంపెనీ ఉంటే.. ఆ కంపెనీకి సీఈవో అవుతారు. ఏ కంపెనీ లేకపోయినా మీ జీవితానికి మాత్రం మీరే సీఈవో. అంతే తేడా! ఇందులో సైకాలజీ ఉంది. సైన్స్ ఉంది. పదివేలమంది జీవితానుభవాల సారం ఉంది. చదవండి. అర్థం చేసుకోండి. ఆచరించండి.
రూల్.. 1 : ఐదు బిందెలు
నీకేం తెలుసు? (నీ విజ్ఞానం)
నువ్వు ఏం చేయగలవు? (నీ నైపుణ్యం)
నీకెవరు తెలుసు? (నీ నెట్‌వర్కింగ్)
నీ దగ్గర ఏం ఉంది? (నీ వనరులు)
నీ గురించి ప్రపంచం ఏంఅనుకుంటున్నది? (నీ పలుకుబడి)
ఈ ఐదింటినీ ఐదు బిందెలుగా ఊహించుకుంటే.. ఆ బిందెలు ఎంత నిండుగా ఉన్నాయి అన్నదానిపైనే నీ విజయం ఆధారపడి ఉంటుంది. శాశ్వత విజయానికి ఈ ఐదూ ముఖ్యమే. ఒక్క విజ్ఞానంతోనో, ఒక్క నెట్‌వర్కింగ్‌తోనో ఏదీ సాధ్యం కాదు. ఏ ఒక్కటో నిండుగా ఉండి.. మిగిలినవన్నీ ఖాళీగా ఉన్నవారు ఓ వెలుగు వెలిగి మాయమైపోతారు. ఆ గెలుపులో స్థిరత్వం ఉండదు. కాబట్టి, నిత్యం ఐదు బిందెలను నిండుగా ఉంచుకోండి. మంచి జీతం ఇచ్చినా, నేర్చుకునే అవకాశం లేని కొలువు.. దీర్ఘకాలంలో మిమ్మల్ని జాబ్ మార్కెట్‌కు దూరం చేస్తుంది.
రూల్.. 2 : క్లాస్ తీసుకోండి
ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే చదవాలి. అర్థం చేసుకోవాలనుకుంటే రాయాలి. పట్టు సాధించాలనుకుంటే ఎవరికైనా క్లాస్ తీసుకోవాలి. లేదంటే నలుగురి ముందూ మాట్లాడాలి. సామాజిక మాధ్యమాలు వచ్చాక.. పాఠకులు, శ్రోతల కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. చెప్పాలనుకున్నదేదో ధైర్యంగా చెప్పండి, నిర్భయంగా వాదించండి. ఎంత సంక్లిష్టమైన విషయాన్ని అయినా సరళంగా చెప్పండి. అతిసాధారణ వ్యక్తికి సైతం అర్థం కావాలి. కాబట్టే, యాభైమంది విద్యార్థులు ఉన్న తరగతి గదిలో యాభై ఒకటో వాడైన ఉపాధ్యాయుడే అందరికంటే ఎక్కువ నేర్చుకుంటాడు. ప్రతి పాఠం అతనికి ఓ కొత్త పాఠం నేర్పుతుంది. బోధన రంగం నుంచి వచ్చినవారు సివిల్ సర్వెంట్స్‌గా, రాజకీయ నాయకులుగా విజయం సాధించడానికి ఇదో ప్రధాన కారణం. అలానే, ఫీడ్‌బ్యాక్‌ను హుందాగా స్వీకరించండి.
రూల్.. 3 : మీ కోసం పెట్టుబడి
నీకు చాలా ప్రాధాన్యాలు ఉండొచ్చు. కారు కొనుక్కోవడం. డూప్లెక్స్ కట్టుకోవడం. విదేశాలకు వెళ్లడం. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించడం. వీటిలో శారీరక, మానసిక ఆరోగ్యానికి తగినన్ని నిధులు కేటాయించకపోతే.. మిగిలినవేవీ సాధించలేవు. ఆసుపత్రి మంచానికే పరిమితం అయినప్పుడు.. డూప్లెక్స్ ఉన్నా లేనట్టే, కారున్నా లేనట్టే. ‘ఆరోగ్యానికి ఇంకొంత ప్రాధాన్యం ఇవ్వాల్సింది నేను’ అని వారెన్ బఫెట్ ఎన్నిసార్లు అనుకున్నారో. విదేశీ పర్యటనలు, సుదీర్ఘమైన వారాంతాలు.. ఆనందం కోసం, అనుభూతుల కోసం మనం భారీగానే ఖర్చు చేస్తాం. ఆరోగ్యానికి మాత్రం నయాపైసా విదిలించాలనుకోం. మంచి జిమ్‌లో మెంబర్‌షిప్ తీసుకోండి, హెల్త్ గ్యాడ్జెట్స్ కొనుక్కోండి. నాణ్యమైన భోజనం ఆర్డర్ ఇవ్వండి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి. రోగ గ్రస్తులు విజేతలుగా నిలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. నీ ఆరోగ్యం మీద నువ్వు పెట్టే పెట్టుబడే అత్యుత్తమమైంది.
రూల్.. 4 : ఉష్ట్రపక్షిలా ఉండొద్దు
అనుకోని ఉత్పాతాలు ఎదురైనప్పుడు ఉష్ట్రపక్షి.. గొయ్యి తవ్వుకుని అందులో తలపెట్టి కాలక్షేపం చేస్తుంది. కారణం.. దానికి వాస్తవాలంటే భయం. నిజాలంటే దడ. అదే పులి.. సంక్షోభ సమయంలో పోరాటానికి సిద్ధపడుతుంది. వ్యక్తి అయినా, సంస్థ అయినా.. పులి బాటలోనే నడవాలి. ఎదురొడ్డి నిలవాలి. సవాళ్లను స్వీకరించాలి. పరిష్కారం వెతకాలి. మార్పు అనివార్యమైన సమయంలో ఉష్ట్రపక్షిలా ప్రవర్తించి ఉనికిని కోల్పోయిన సంస్థల జాబితా చాలా పెద్దదే.. నోకియా, బ్లాక్ బెర్రీ, కొడక్! దేని ఫెయిల్యూర్ స్టోరీ దానిదే. కొడక్.. ఫిల్మ్ జమానా నుంచి బయటికి రాలేకపోయింది. బ్లాక్ బెర్రీ .. మారుతున్న సాంకేతికతను అన్వయించుకలేక పోయింది. సంక్షోభాలూ సవాళ్లూ ఎక్కడైనా ఉండేవే. కానీ వాటినుంచి తప్పించుకునే ప్రయత్నంలో మనదైన ఉనికిని కోల్పోకూడదు.
రూల్.. 5 : నీ అలవాట్లే నీ విజయం
భవిష్యత్తులో ఓ కొత్త విజయాన్ని సాధించాలని అనుకుంటే ఈ రోజు ఓ కొత్త అలవాటును అలవరుచుకో. ఆ అలవాటు నీ విజయానికి సహకరించేది కావాలి. ఇంకొక్క షరతు. ఏదైనా ఓ దురలవాటు స్థానంలో ఆ కొత్త మంచి అలవాటును భాగం చేసుకో. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఓ మంచి అలవాటును కొత్తగా చేర్చుకుంటాం. ఓ చెడ్డ అలవాటును ఉద్దేశపూర్వకంగా దూరం చేసుకుంటాం. పాత అలవాటు స్థానాన్ని కొత్త అలవాటుతో భర్తీ చేయడం తెలివైన వ్యూహం. డివైడర్‌ను తాకకుండా కారు నడపాలనే ఆత్రుత చివరికి డివైడర్‌ను గుద్దేలా చేస్తుంది. అదే రోడ్డు మీద ఫోకస్ చేస్తే.. సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాం.
రూల్.. 6 వాతాపి జీర్ణం
ఆహారాన్ని ఎంత వేగంగా హరాయించుకుంటే అంత శారీరక ఆరోగ్యం. వాస్తవాల్ని ఎంత నిజాయతీతో జీర్ణించుకుంటే అంత మానసిక ఆరోగ్యం. మనుషుల స్వభావాల్ని, సమాజ స్వరూపాన్ని, వ్యవస్థలోని లోపాల్ని, ఎదుటి మనిషిలోకి వక్రబుద్ధిని.. యథాతథంగా స్వీకరించడం దీర్ఘకాలిక విజయానికి తొలిమెట్టు. ఓటమి ఎదురైందా.. కుమిలిపోతూ కూర్చోవద్దు. వెంటనే అరిగించుకో. గెలుపు ఎదురైందా.. పొంగిపోతూ కూర్చోవద్దు. వెంటనే అరిగించుకో. ఏ ప్రభావమూ మనల్ని ఎక్కువ రోజులు వెంటాడకూడదు. నీ జర్నీని ఎంజాయ్ చెయ్. విజయా నందం క్షణికమే. కానీ ప్రయాణ జ్ఞాపకాలు జీవితాంతం.
రూల్.. 7 : ఆరోగ్యం మహాభాగ్యం
ఆరోగ్యం ఒకటి అయితే.. కెరీర్ ఆ ఒకటి పక్కన ఒకటో సున్నా, ఆస్తిపాస్తులు రెండో సున్నా, సమాజంలో గౌరవం మూడో సున్నా, కుటుంబం నాలుగో సున్నా. తొలి అంకె ఒకటి బలంగా ఉంటేనే.. మిగతా సున్నాలకు విలువ. ఆ ‘ఒకటి’ లేకపోతే.. మిగిలినవన్నీ గుండు సున్నాలే! ఆరోగ్యం విలువకు సంబంధించి ఒక ఉదాహరణ.. ఒక మిలియన్ డాలర్ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. టర్నోవర్ సూపర్. భవిష్యత్ ప్రణాళిక సూపర్. బ్యాలెన్స్ షీట్ సూపర్. అంతలోనే ఓ షేర్ హోల్డర్ ప్రశ్న లేవనెత్తాడు.. ‘సర్! మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పదికి తొమ్మిది మంది ఊబకాయులే. ఎనిమిది మందికి అధిక రక్తపోటు సమస్య ఉంది. ఆరుగురికి ఇప్పటికే బైపాస్ చేశారు. ఒకరిద్దరు ఇన్సులిన్ మీద ఉన్నారు. ఇలాంటి నాయకత్వంతో మనం దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించగలమా?’. నిజమే. ఈసురోమని యాజమాన్యం ఉంటే, కంపెనీ ఎలా బాగుపడుతుంది? ఆరోగ్యం.. అత్యంత ప్రధానమైన విషయం. ఆరోగ్య విజయం తర్వాతే ఏ విజయమైనా? నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడమే నీ కుటుంబం పట్ల శ్రద్ధకు తార్కాణం. శారీరక బలంతోనే మానసిక బలం. మానసిక బలంతోనే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతోనే అద్భుత విజయాలు. అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు. కార్పొరేట్ ప్రపంచంలోనూ కావచ్చు.
రూల్.. 8 : చిన్న మార్పులు.. పెద్ద విజయాలు
డేవిడ్ బ్రెయిల్స్‌ఫోర్డ్ అనే పెద్ద మనిషి ‘మార్జినల్ గెయిన్స్’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక శాతం మెరుగుదలతో లక్ష్యానికి పదిశాతం చేరువ కావచ్చని నిరూపించాడు. ఒలింపిక్స్‌లో బ్రిటిష్ సైక్లింగ్ జట్టు విజయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపించారు. జట్టు పనితీరును మెరుగుపరిచే ప్రయత్నంలో డేవిడ్ భారీ సంస్కరణల జోలికి వెళ్లలేదు. అతి సూక్ష్మమైన లోపాల మీద దృష్టి సారించాడు. సైక్లిస్టులు తరచూ ఇన్ఫెక్షన్ల కారణంగా అనారోగ్యానికి గురయ్యేవారు. దీంతో యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ జెల్ వాడేలా చర్యలు తీసుకున్నాడు. మరింత గ్రిప్ కోసం టైర్లకు ఆల్కహాల్ పూయడం మొదలుపెట్టాడు. సీట్లను మరింత సౌకర్యవంతంగా డిజైన్ చేయించాడు. ఆటగాళ్ల పడక గదుల్లో దిండ్లు మార్పించాడు. దీంతో నిద్రలేమి సమస్య తీరింది. ఈ చిన్నచిన్న మార్పులన్నీ కలిసి అద్భుతమైన ఫలితాలు చూపించాయి. పతకాల పంట పండించాయి.
రూల్.. 9 : బలమైన ‘కల్ట్’
ఒక సంస్థను ‘కల్ట్’లా తీర్చిదిద్దగలిగితే ఆ స్టార్టప్‌కు వందేండ్ల ఆయువు ఖాయం.. అంటారు మేనేజ్‌మెంట్ నిపుణులు. కల్ట్‌లో నాయకత్వం మీద అపారమైన గురి ఉంటుంది. ఈ సందర్భంగా ‘పీపుల్స్ టెంపుల్ కల్ట్’ ఉదంతాన్ని ప్రస్తావించాలి. ఆ గుంపు నాయకుడి పేరు జిమ్ జోన్స్. ఓ రోజు తన అనుచరుల్ని పిలిచి శీతలపానీయంలో కలుపుకొని తాగమంటూ సైనేడ్ చేతికిచ్చాడు. మరో ఆలోచన లేకుండా తాగేశారు అంతా. అదీ నాయకత్వం మీద నమ్మకం! ఇందులోని అతివాదాన్ని పక్కనపెట్టి.. నాయకుడి ఆదేశాల వరకు మాత్రమే తీసుకోవాలి. జిమ్ కొలిన్స్ తన ‘బిల్డ్ టు లాస్ట్’ అనే పుస్తకంలో ఎంతోకొంత డోసేజీలో కల్ట్ కల్చర్ ఉన్న కంపెనీలే దీర్ఘకాలం మనగలుగుతాయని చెప్పారు. సమర్థులైన యజమానులు ఈ సంస్కృతిని సంస్థ పని వాతావరణంలో భాగం చేస్తారు. కొత్తగా కంపెనీని ప్రారంభిస్తున్నప్పుడు నియమించుకునే తొలి పదిమంది ఉద్యోగులే కల్ట్ రాయబారులు.
రూల్.. 10 : హ్యాపీ ఫెయిల్యూర్!
ఓటమికి భయపడేవారు, ఓటమిని చూసి పారిపోయేవారు, ఓటమిని దారుణమైన పరాభవంగా భావించేవారు.. ఎప్పుడూ విజేతలు కాలేరు. థామస్ జే వాట్సన్ అనే పెద్ద మనిషి ఐబీఎం ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఓ సంఘటన జరిగింది. ఓ ఉద్యోగి అజాగ్రత్త వల్ల సంస్థకు ఆరు లక్షల డాలర్ల నష్టం సంభవించింది. అతడిని తొలగించాల్సిదేనంటూ మానవ వనరుల విభాగం పట్టుపట్టింది. అయినా వాట్సన్ నిరాకరించారు. ‘ఎలా తప్పు చేయకూడదో ఓ ఉద్యోగికి నేర్పించడానికి ఈ ఆరు లక్షల డాలర్లను ఖర్చు పెట్టానని అనుకుంటున్నాను’ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ సంస్థలోనూ వినిపించకూడని మాటలు రెండు.. జయం, అపజయం. విజయం సాధించామని సంతృప్తి చెందగానే ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతాం. అపజయానికి గురైన భావన కలిగినప్పుడు కుంగుబాటుకు గురవుతాం. రెండూ మంచి లక్షణాలు కావు. సక్సెస్, ఫెయిల్యూర్ నాణానికి రెండు కోణాలని గుర్తించాలి.
రూల్.. 11 : అందే ద్రాక్షే తీయన
ద్రాక్ష పందిరి దగ్గరికి తీసుకెళ్లి.. ‘ఓ పండు కోసుకోండి’ అని చెబితే అందే గుత్తివైపే అందరి చేతులూ వెళ్తాయి. అంతకంటే పెద్ద పండ్లు ఇంకాస్త పైన ఉన్నా సరే.. అస్సలు ప్రయత్నించరు. మోటివేషన్ లేకపోవడమే దీనికి కారణం. చాలా సంస్థల అపజయం ఇక్కడే మొదలవుతుంది. ఆపిల్ లాంటి కంపెనీలు ఆ రహస్యాన్ని అర్థం చేసుకున్నాయి. కాబట్టే, అనూహ్యమైన విజయం సాధించాయి. తన పనితనం కంపెనీ లాభాల్ని ప్రభావితం చేస్తుందనే స్పృహ ఏర్పడితే.. ప్రతి కార్మికుడూ చేయి తిరిగిన నిపుణుడు అవుతాడు. అయితే, అతనికి తగినంత స్వేచ్ఛనివ్వాలి. లక్ష్యసాధనలో అవరోధాలు తొలగించాలి. సిబ్బంది విజయాలకు ప్రచారం కల్పించాలి. అవార్డులతో, ప్రోత్సాహకాలతో సత్కరించాలి.
రూల్.. 12: కమ్యూనికేషన్
ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య ఉత్పన్నమైనా, సమస్య పరిష్కారమైనా కమ్యూనికేషనే కారణం. ఇక్కడ గొప్ప వాదనా పటిమతో పనిలేదు. అదేదో రాజకీయ పార్టీ నినాదంలా ‘నేను ఉన్నాను. నేను విన్నాను’ అనే విషయాన్ని ఎదుటి మనిషి అర్థం చేసుకోగలిగితే చాలు. కమ్యూనికేషన్‌లో మాటలే కీలకం. ఇద్దరి మధ్య వంతెనలు కట్టినా, అగాథం సృష్టించినా మాటలతోనే సాధ్యం. ఎదుటి మనిషి చెబుతున్న దాన్ని వ్యతిరేకించడానికి కేటాయించే సమయాన్ని ఆలోచించడానికి వెచ్చించండి. స్టీఫెన్ కవే అనే మేనేజ్‌మెంట్ గురువు ‘థర్డ్ ఆల్టర్నేటివ్’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. మనం గెలవాలని చూస్తాం. ఎదుటి మనిషిని ఓడగొట్టాలని చూస్తాం. కానీ ఇద్దరూ గెలిచే మార్గం ఏదైనా ఉందా అనే కోణంలో ఆలోచించం. ఇక్కడే మన కమ్యూనికేషన్ విఫలం అవుతున్నది. మన శక్తిలో చాలా భాగాన్ని మెదడు ఆలోచనలకే ఖర్చు చేస్తున్నది. ఆ ఆలోచన సానుకూలంగా ఉన్నప్పుడే.. ఆ శక్తి సద్వినియోగం అయినట్టు.
రూల్.. 13 : హ్యాబిచ్యుయేషన్
మెదుడులోని అత్యుత్తమ సాఫ్ట్‌వేర్.. హ్యాబిచ్యుయేషన్. మన తక్షణ లక్ష్యం మీద దృష్టిసారించేలా చేయడం.. పెద్దగా ప్రాధాన్యం లేని విషయాల్ని వరుస క్రమంలో చిట్టచివరికి నెట్టేయడం దీని బాధ్యతలు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు.. తీవ్రంగా స్పందిస్తాం. అదే సమస్య రెండోసారి వస్తే.. ఆ తీవ్రత కొంత తగ్గుతుంది. మూడోసారి వస్తే.. ఎంత స్పందించాలో అంతే స్పందిస్తాం. ఇదంతా హ్యాబిచ్యుయేషన్ ప్రభావమే. దీనివల్ల పాతను పక్కన పెట్టి, కొత్త మీద దృష్టి సారించడానికి వీలవుతుంది. ఎంత గొప్ప విషయాన్ని అయినా పదేపదే చెప్పడం వల్ల దాని విలువ తగ్గిపోతుంది. అందుకే, కొత్త విషయాలు చెప్పాలి. అదీ కొత్తగా చెప్పాలి. ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్.. ప్రతి సినిమాలోనూ ఈ మూడు పాత్రలూ ఉంటాయి. ఈ ముగ్గురినీ ఎంత వైవిధ్యంగా చూపితే.. సినిమా అంత ఘనవిజయం సాధిస్తుంది. సంప్రదాయ బంధనాలను తెంచుకున్న వాణిజ్య ప్రకటనలే మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తాయి. కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇదే మాట సాహిత్యానికి కూడా వర్తిస్తుంది.
రూల్.. 14 : ఫ్లూయిడ్ లీడర్‌షిప్
నాయకుడు నీళ్లలా ఉండాలి. నీటి ప్రవాహ దిశ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవసరాన్ని బట్టి మారుతుంది. పరిస్థితులను బట్టి మలుపులు తీసుకుంటుంది. నాయకుడూ అంతే. అనుచరులో, సహచరులో అతను తీసుకోబోయే నిర్ణయాలను అంచనా వేయగలిగే పరిస్థితి ఉండకూడదు. అనూహ్యత అతిగొప్ప నాయకత్వ లక్షణం. అదే సమయంలో, అంకెలతో బేరీజు వేసుకొని హృదయంతో నిర్ణయం తీసుకోవాలి. ప్రజల్ని మోటివేట్ చేసే ఉద్యోగంలో ఉన్నప్పుడు.. మన ఉద్వేగాల మీద మనకు పట్టు ఉండాలి. ఎవరితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. భుజం ఎప్పుడు తట్టాలో, వేలు ఎప్పుడు ఎత్తాలో తెలిసి ఉండాలి.
విజయానికి నాలుగు మెట్లు ఉంటాయి. తొలి మెట్టు.. నువ్వు. నీ విజయానికి నువ్వే తొలి పునాది. నీ బలాల పట్ల అవగాహన, బలహీనతల పట్ల ఎరుక, నీ మీద నీకు నియంత్రణ.. చాలా అవసరం. రెండో మెట్టు.. నీ స్టోరీ. గణాంకాలు, సర్వేలు, సిద్ధాంతాలు.. వీటన్నిటికంటే గుండె తడి ముఖ్యం. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి. బలంగా నమ్మాలి. మూడో మెట్టు.. ఫిలాసఫీ మనకంటూ ఓ సిద్ధాంతం ఉండాలి. ఆరునూరైనా దానికి కట్టుబడి ఉండాలి. అది మన మాటలో, నడతలో ప్రతిబింబించాలి. నాలుగో మెట్టు.. బృందం. సాధారణ వ్యక్తులతో అసాధారణ బృందాన్ని నిర్మించేవాడే సమర్థుడైన సీఈవో.