Trending

6/trending/recent

Analysis B.Ed Vs D.Ed సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు : నాణ్యత లేని ప్రాథమిక విద్య... విద్యార్థుల ప్రాథమిక హక్కును హరిస్తుంది !

11/08/2023 న సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు :: నాణ్యమైన ఉపాధ్యాయులు  లేకుండా , నాణ్యమైన ప్రాథమిక విద్య అందదు . 

( దేవేష్ శర్మ vs యూనియన్ ఆఫ్ ఇండియా , సివిల్ అప్పీల్ నంబర్ - 5068 of 2023).

Analysis B.Ed Vs D.Ed సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు :  నాణ్యత లేని  ప్రాథమిక విద్య...  విద్యార్థుల ప్రాథమిక హక్కును హరిస్తుంది !

*****************************

చరిత్ర:- 

గురువులకే గురువు అయిన గోపాలకృష్ణ గోఖలే ,  జాతి పిత మహాత్మా గాంధీలు కలలు కన్నట్లుగా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విద్య '' నిర్బంధం చేయబడలేదు , మరియు అది కనీసం ప్రాథమిక హక్కు గా కూడా పరిగణించబడలేదు.". ఈ లోపాన్ని సుప్రీమ్ కోర్టు వివిధ తీర్పుల ద్వారా సరిచేసి ...  పాఠశాల  విద్య పౌరుల ' ప్రాథమిక హక్కుగా ' నెలకొల్పింది . తదుపరి వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు , కేంద్ర ప్రభుత్వం 2002 లో 86 వ భారత రాజ్యాంగ సవరణ చేసి , 6 నుండి 14 సంవత్సరాల వారికి ప్రాథమిక విద్యను, ఒక ప్రాథమిక హక్కు గా  ఆర్టికల్ 21 A కింద చేర్చింది.

తదుపరి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు , రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన ప్రాథమిక హక్కును ... అమలు పరచడం కోసం  ''విద్యా హక్కు చట్టం -2009'  తీసుకువచ్చారు. 

విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చాక బడుల సంఖ్య పెరిగింది , కొన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి.... కానీ నాణ్యమైన విద్య అందడం  అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఇందుకు ఒక ప్రధాన కారణం ' బాధ్యతాయుతం గా పాఠాలు చెప్పే ... సరైన శిక్షణ కలిగిన నాణ్యమైన ఉపాధ్యాయులు లేకపోవటం ''. 

****************************

ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనే రోజులు పోయి ,  ' ఇప్పుడు ఉపాధ్యాయుల జీతాలు వేలల్లో, లక్షల్లో ఉన్నాయి '. ఒకప్పుడు 7 వ తరగతి పాస్ అయిన వారికి రెండు సంవత్సరాలు ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చి ... వారినే సర్వీస్ లోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది...  డిగ్రీ లు , పీజీ లు చేసిన వారు మాత్రమే ఉన్నారు ( 96% పైగా) . టీచర్లకు అయితే డిగ్రీలు ఉన్నాయి  ... కానీ వారి బోధనలో నాణ్యత లేదు... కారణం  వారికి సరైన శిక్షణ లేదు.

 M. Sc. , M.Ed చేసిన వారు 1 , 2 తరగతుల పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు . అంటే అక్షరాలు , పదాలు ,  వాక్యాలు, కూడికలు , తీసివేతలు నేర్పాలి... చిన్న చిన్న కథలు చెప్పాలి , పాటలు నేర్పాలి..  ఎటువంటి శిక్షణ లేకుండా ఇవి     M.Sc , M.Ed లు ;  B. Sc. , B.Ed లు  చేయగలరా ? 

*****************************

బడితె ఉన్నవాడిదే బర్రె! - నోరు ఉన్నవాళ్లు చెప్పిందే ప్రభుత్వాల విద్యా విధానం :

నిజానికి ఈ దేశంలో ఉపాధ్యాయుల శిక్షణ పై  చెప్పుకోదగ్గరీతిలో , సరైన దిశగా   చర్చ జరగలేదు. 

ప్రాథమిక విద్యా బోధన చేసే ఉపాధ్యాయుల కోసం D.Ed  , మాధ్యమిక విద్యా బోధన చేసే ఉపాధ్యాయుల కోసం B.Ed  కోర్సులు ఉన్నాయి.... వీరి ప్రాక్టికల్స్ శిక్షణ కూడా ఆయా కోర్సులకు తగినట్లుగానే ఉంటుంది. 

కానీ దురదృష్టవశాత్తు ప్రైవేట్ కాలేజ్ ల లాబీయింగ్ , బీ.ఎడ్ చదివిన విద్యార్థులు రాష్ట్రాలలో ఎక్కువగా ఉండటం వలన ... వారు రాజకీయ పార్టీల పై ఒత్తిడి తెచ్చి ....నిబంధనలు మార్పించుకొని  " తమకు ఎటువంటి శిక్షణ , నైపుణ్యం లేని...  ప్రాథమిక విధ్యార్ధులకు పాఠాలు బోధించే టీచర్లు గా నియమితుల్యారు ". ఇది ఎలాంటిదంటే ' జనరల్ మెడిసిన్ చదివిన డాక్టర్ ... పిల్లల వైద్యుడి గా ఆసుపత్రిలో ఉద్యోగంలో  చేరడం  లాంటిది . '.

******************************

సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పిన అంశం ఏమిటంటే ' ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం. ఆ శిక్షణ ( కోర్సు ) తీసుకున్నవారే అనగా D.Ed వారినే  ప్రాథమిక టీచర్లు గా నియమించాలని , B.Ed వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వారిని ప్రాథమిక టీచర్లు గా అర్హత ఇవ్వడం అనే నిర్ణయం  ....  ప్రాథమిక స్థాయి విద్యార్థుల యొక్క బోధనావసరాలను ( learning necessities )  ,  భవిష్యత్తును ,  శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొని చేసింది కాదు అని. 

*****************************

మేధావుల , రాజకీయ పార్టీ ల మౌనం :-

దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో నాణ్యత లేని  పాఠశాల విద్య గురించి మేధావులు , రాజకీయ పార్టీలు మౌనం వహించడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ' 4 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులలో 10 లక్షల పైచిలుకు మందికి తెలుగు లో 3 సరళ  ( చాలా తేలికైన ) వాక్యాలు ఉన్న పేరా ను తప్పులు లేకుండా చదవలేరు . 17 లక్షల పై చిలుకు మందికి ' i like this book , this is my house ' లాంటి ఇంగ్లీష్ వాక్యాలు చదవడం రాదు. ( Ref :- బేస్ లైన్ పరీక్ష , 2022 ) 

విద్యార్థుల ప్రమాణాలు ఇంత ఘోరంగా ఉన్నా కూడా ' మేధావులు, రాజకీయ పార్టీ లు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం... బాధ్యతారాహిత్యమే . ఎందుకంటే విద్య సామాజిక , ఆర్థిక , రాజకీయ , సాంఘిక మార్పులకు దారితీస్తుందని.... తద్వారా సమానత్వం సాధించగలమని నమ్ముతున్నామో....  ఆ మార్పులు రావాలంటే కనీసం పిల్లలకు చదవడం , రాయడం రావాలి. అవి లేకుండా విద్య వలన ఏ విధమైన మార్పులు రావు. 

*****************************

 అసలు ప్రశ్న:: 

 భాషకు లిపి వచ్చినప్పటినుండి పిల్లలకు వారి వారి మాతృభాషలో చదవడం , రాయడం , మరియు చిన్నపాటి లెక్కలు అనే ప్రక్రియలు నేర్పడం అనేది అనాదిగా ప్రతీ సమాజం అమలు  పరిచిన విధానం. రాజులు మారినా , మతాలు మారినా , పరిపాలన విధానాలు మారినా ,  ఇంకా ఇతర విషయాలలో మార్పు వచ్చినా సరే ... భారత దేశంలోని ప్రతీ గ్రామంలో , ప్రతీ పట్టణంలో ఈ బోధనా ప్రక్రియ కొనసాగింది. బ్రిటిష్ వాళ్ళు రాకముందే అన్ని వర్ణాలకు ,   అన్ని వర్గాలకు వీధి బళ్ళలో ప్రాథమిక విద్య ను బోధించారు. పిల్లల తెలివి తేటలమేర ఈ ప్రాథమిక విద్య రెండు నుండి నాలుగు సంవత్సరాలు జరిగేది. ఈ సమయంలో వారికి చదవడం , వ్రాయడం , సాధారణ గణితం నేర్పేవారు.  బ్రిటిష్ వారు రాక ముందు భారత దేశంలో విద్య ఎలా ఉంది అన్న విషయం పై ... మద్రాసు ప్రావిన్స్ లోని అప్పటి బ్రిటిష్ కలెక్టర్లు వ్రాసిన రిపోర్టులను క్రోడీకరించిన  బ్రిటిష్ గవర్నర్ జర్నల్  థామస్ మన్రో ,  1820 లలో పూర్తి రిపోర్ట్ లో  వ్రాశారు. అందులో పైన తెలిపిన అంశాలు మతాల ,  వర్ణాల వారీ గా బడిలో ఉన్న మగ పిల్లల గణాంకాలు ఉన్నాయి. ( Ref -:- the beautiful tree : indigenous Indian education in 18th century ).

స్వాతంత్రోద్యమ కాలంనుండి ....  1980 ల ముందు వరకు కూడా చాలా  ప్రాథమిక బడులు పూరిపాకల్లో , రేకుల షెడ్ల లలో ఉండేవి. అయినా పిల్లలకు చదవడం , రాయడం చక్కగా నేర్పారు. 

వేల సంవత్సరాలుగా వీధి వీధినా..  వీధి బళ్లలో చక్కగా నడిచిన ఈ బోధనా ప్రక్రియ , గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇంత లోపభూయిష్టంగా తయారయ్యింది ?  రోజూ బడికి  వెళ్ళే లక్షలాది మంది పిల్లలకు కనీసం చదవడం , రాయడం ఎందుకు నేర్పలేక పోతున్నాము ?? అన్న ప్రశ్నకు  నిజాయితీ గా పరిష్కారం వెతకాలి. లేనియెడల జాతి భవిష్యత్తు అంధకారమవుతుంది. 

ఇట్లు ,

డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్. 

14/08/2023.

For Supreme Court Judgement Copy Click Here

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad