Digital Pasting : డిజిటల్ ఉపవాసం ఉంటే మేలు!
‘డిజిటల్ ఫాస్టింగ్ చేయండి..’ ఇటీవల ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ విద్యార్థులకు ఇచ్చిన పిలుపు ఇది. పరీక్షల మీద పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టేందుకు, మంచి మార్కులతో పాసయ్యేందుకు ఈ డిజిటల్ ఉపవాసం ఉపయోగపడుతుందని ఆయన విద్యార్థులకు సూచించారు. మరి దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామా...
‣ ఒక రోజు లేదా ఒక వారంలో... ఏదైనా కొంత నిర్దేశిత సమయంపాటు ఏ విధమైన టెక్నాలజీని వాడకుండా ఉండటమే డిజిటల్ ఫాస్టింగ్. ఇదెలా చేస్తారనేది విద్యార్థులు వారి వారి అలవాట్లను బట్టి నిర్ణయించుకోవాలి.
‣ ఇది మనం ల్యాప్‌టాప్/ట్యాబ్ ముఖ్యంగా ఫోన్ వాడే విధానంపై ఒక నియంత్రణ కోసం ఉద్దేశించినది. అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగిస్తూ, అధిక సమయం అంతర్జాలంలో గడిపి సమయాన్ని వృథా చేసుకోకుండా పరిమిత వినియోగాన్ని సాధన చేసే ప్రక్రియ.
‣ సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించడం ఎప్పుడూ మంచిది కాదు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఇది మరింత చేటు చేస్తుంది కాబట్టి డిజిటల్ ఉపవాసాన్ని సాధన చేయాలి. ఇది ఫోకస్ పెరిగేందుకు, చదివింది బాగా అర్థమయ్యేందుకు, మెదడుపై ఒత్తిడి తగ్గించేందుకు, సరిపడా నిద్రపోయేందుకు.. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
‣ ఈ ఫాస్టింగ్‌ను పలువిధాలుగా చేయవచ్చు. రోజువారీగా, వారానికి ఒకసారి, సాధ్యమైతే నెలలపాటు కూడా కొనసాగించవచ్చు. ఈ సమయంలో ఏ విధమైన స్క్రీన్ టైమ్ లేకుండా ఉండటం ముఖ్యం. ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు దూరంగా ఉంటూ పూర్తిగా చదువుపై, పరీక్షలపై ఫోకస్ పెట్టాలి. మరి మీరు కూడా చేస్తారు కదూ!