ప్రచురణార్ధం, తేది:22.06.2022
PDF MLC's Press Note : Minister Agreed for Zero 0 Service Transfers
విద్యాశాఖా మంత్రితో ఎమ్మెల్సీల చర్చలు సానుకూలం విద్యాశాఖామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణగారితో నేడు పిడియఫ్, స్వతంత్ర శాసనమండలి సభ్యులు క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం చాలా సహృద్భావంగా సానుకూలంగా జరిగింది.
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ఫలితంగా వేలాది పోస్టులు రద్దుకావడం, పనిభారం విపరీతంగా పెరగడంపై ఎమ్మెల్సీలు మంత్రిగారి దృష్టికి తీసుకొనిరాగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్ల పోస్టులుంచేందుకు, హైస్కూళ్ళలో హెడ్మాష్టరు ఫిజికల్ డైరెక్టరు పోస్టులు కొనసాగించేందుకు, స్కూలు అసిస్టెంట్లు దినసరి పరిగంటలు తగ్గించేందుకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూలు ఆసిస్టెంట్ల పోస్టులు కొనసాగించేందుకు, యల్.ఎఫ్.ఎల్ హెడ్మాస్టర్ల పోస్టులు యధాతథంగా వుంచేందుకు మంత్రిగారు అంగీకరించారు. అలాగే ఆగష్టు మాసపు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేస్తామన్నారు. పాఠశాలల మ్యాపింగు, 6-8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం మాత్రమే నిర్వహించడం తమ ప్రభుత్వ విధాన నిర్ణయాలనీ వీటిని కొనసాగిస్తామని మంత్రిగారు చెప్పగా ఎమ్మెల్సీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఉపాధ్యాయుల బదిలీలపై నిబంధనలు త్వరలో వెలువరిస్తామని, జీరో సర్వీసుతో ఈ సారి మాత్రం బదిలీలకు అనుమతిస్తామని మంత్రిగారు తెలిపారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఒక డిజిటల్ ఆపరేటర్ను, వాచ్మెన్ ను నియమించేందుకు ముఖ్యమంత్రిగారు అంగీకరించారు. అంతర్ రాష్ట్ర బదిలీలు ఇరు వైపుల నుంచి సమాన సంఖ్యలో బదిలీఅయ్యే ప్రాతిపదికన ఆమోదిస్తున్నామని, 1998 డియస్సీ వారికి త్వరలో నియామకాలు ఇస్తామని, ఉమ్మడి సర్వీసు రూల్సుపై ప్రభుత్వ పంచాయితీరాజ్ టీచర్లు పరస్పర ఒప్పందానికి రావాలని మంత్రిగారు తెలిపారు. కొత్తగా ప్రారంభించనున్న జూనియర్ కళాశాలల్లో పి.జి.టిలుగా ప్రస్తుత స్కూలు అసిస్టెంట్లకు, ప్రిన్సిపాల్స్లో హెడ్మాస్టర్లకు ప్రమోషన్లు ఇస్తారు.
ప్రస్తుతానికి ఒక కి.మీ దూరంలోని ప్రాథమిక పాఠశాలల్ని మాత్రమే మ్యాపింగు చేస్తున్నారు. అవికూడా వసతులుగల ఉన్నత పాఠశాలల్లో మాత్రమే జరుగుతాయి. పాఠశాలల్లో అదనపు తరగతులకు రు.3000 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. భవనాలు పూర్తి అయ్యాక మాత్రమే పూర్తి మ్యాపింగు జరుగుతుంది. మున్సిపల్ పాఠశాలల యాజమాన్యపాలనా బాధ్యతలు విద్యాశాఖ చేపట్టేలా, ఆస్తులు పట్టణాభివృద్ధిశాఖలోనే వుండేలా త్వరలో పుత్తర్వులిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయాల్లోని పి.జి.టిలకు, టి.జి.టిలతో సమానంగా వేతనాలు ఇస్తారు.
ఉపాధ్యాయ సంఘాలతో ప్రతినెలా ప్రజాస్వామికంగా చర్చలు జరిపే విధానాన్ని తీసుకొని రానున్నట్టు కూడా మంత్రిగారు హామీ ఇచ్చారు. మంత్రిగారితో జరిగిన చర్చల్లో పిడియఫ్ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.లక్ష్మణరావు, వై.శ్రీనివాసులురెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ పాల్గొన్నారు.