ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద 10-06 -2022 న ధర్నా నిర్వహించాలని మరియు రాష్ట్ర స్థాయిలో విజయవాడ ధర్నా చౌక్ నందు 17-06 -2022 నుండి రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానించినట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జి. వి నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రకటన లో తెలిపారు.
వీరి ప్రధాన డిమాండ్లు
► 1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిబ్యునల్ రద్దు అయినందున హైకోర్టు నుండి అనుమతి తీసుకొని G O MS No 73 మరియు G O MS No 74 తేదీ 20-09-2017 ప్రకారం ఉన్నత పాఠశాల ల ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు చేపట్టాలి.
► 2) జిల్లా విద్యాశాఖ అధికారులు గాను మరియు ఉప విద్యాశాఖ అధికారులు గాను పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని తొలగించి వారి స్థానంలో అర్హత కలిగిన సీనియర్ ప్రధానోపాధ్యాయులకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలి.
► 3) సమగ్ర శిక్షా లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు గా పనిచేస్తున్న ఇతర శాఖల సిబ్బందిని మరియు విద్యా శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను తొలగించి సీనియర్ ప్రధానోపాధ్యాయులను మాత్రమే, 26 జిల్లాలలో అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లుగా నియమించాలి. వీరిని నియమించుటకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాలి.
► 4) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 40 శాతం లెక్చరర్ పోస్టులను, డైట్ కళాశాలల్లో, యస్ సి ఇ ఆర్ టి లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను మరియు మండల విద్యాశాఖ అధికారుల పోస్టులను ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో మరియు ప్రధానోపాధ్యాయులతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయవలెను. జూనియర్ కళాశాలల్లో 50 శాతం లెక్చరర్ పోస్టులలో కళాశాలల్లో తాత్కాలికముగా పనిచేస్తున్న అధ్యాపకులను పర్మినెంట్ చేయాలి.
► 5) ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు గాను ప్రధానోపాధ్యాయులను అసిస్టెంట్ డైరెక్టర్లు గాను విద్యేతర కార్యక్రమాల నిర్వహణ, కార్యాలయ అనుభవం కొరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో డెప్యుటేషన్ పై ఒక సంవత్సర కాలము నియమించ వలెను.
► 6) ఏకీకృత సర్వీసు నిబంధనల వలన ఏర్పడిన సమస్యకు పరిష్కారంగా మున్సిపల్ పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు మరియు పంచాయతీరాజ్ పాఠశాలలకు విడివిడిగా పర్యవేక్షణా అధికారులుగా ఆయా మేనేజ్మెంట్ లలో పనిచేస్తున్న సీనియర్ ప్రధానోపాధ్యాయులను నియమించే విధంగా నిబంధనలు రూపొందించి పదోన్నతులు కల్పించాలి.
► 7) ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న ఇంటర్మీడియట్ తరగతులకు బోధించుటకు స్కూల్ అసిస్టెంట్ లను జూనియర్ లెక్చరర్లుగా మరియు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయుల పోస్టులుగా ఉన్నతీకరించాలి. 500 మంది విద్యార్థులు ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల పోస్ట్ ను గ్రేడ్ 1 గా ఉన్నతీకరించి పదోన్నతులు ఇవ్వాలి.
► 8) విద్యార్థుల సంఖ్య తో నిమిత్తం లేకుండా అన్ని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టును మరియు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులను కొనసాగించాలి. ఉన్నతీకరించబడిన అన్ని ఉన్నత పాఠశాలలకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పోస్ట్, ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ మరియు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలి.
► 9) నాడు - నేడు పేస్ 2 పనులలో ప్రధానోపాధ్యాయులను పర్యవేక్షణ వరకే పరిమితం చేయాలి. అప్లోడింగ్ బాధ్యతలన్నీ కూడా సెక్రటేరియట్ లో పనిచేస్తున్న విద్యా కార్యదర్శి కి లేదా సి ఆర్ పి కి అప్పగించాలి. ఫేస్ 1 లో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు యన్ క్యాష్ మెంట్ తో కూడిన సంపాదిత సెలవులు మంజూరు చేయాలి.
► 10) అన్ని ఉన్నత పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ మరియు నైట్ వాచ్ మెన్ ను నియమించాలి. పాఠశాలలకు అవసరమైన నిర్వహణా నిధులను పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి విడుదల చేయాలి.
► 11) ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను మాత్రమే అమలు పరచాలి.