- నూరుశాతం ఫలితాలు రావాలంటూ లక్ష్యాలు
- విద్యార్థుల ప్రతిభ, బోధన పట్టని ఉన్నతాధికారులు
- ఉత్తీర్ణత లేకపోతే ఉపాధ్యాయులపైనే బాధ్యత
- పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్‌కు కారణాలివే..
- 52 మందిపై కేసులు.. 38 మంది సస్పెన్షన్
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వారి సొంత పిల్లలో, బంధువుల పిల్లలో కారు. అయినా వారిని నూటికి నూరుశాతం ఉత్తీర్ణులు చేయించేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎందుకు అతిగా తాపత్రయపడుతున్నారు? ప్రశ్నపత్రాల లీకేజీలు.. మాస్ కాపీయింగ్‌లకూ ఎందుకు తెగిస్తున్నారు? ఈ క్రమంలో అరెస్టులు, సస్పెన్షన్లకు ఎందుకు గురవుతున్నారు?
పదోతరగతి పరీక్షలు రాష్ట్రంలో ఈసారి ఎన్నడూ లేనంత గందరగోళంగా మారాయి. పరీక్ష జరిగిన ప్రతిరోజూ లీకేజీలు.. మాస్‌కాపీయింగ్‌లకు తెరలేస్తూనే ఉంది. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకూ 52 మందిపై కేసులు నమోదు కాగా.. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వీరిలో 38 మంది ఉపాధ్యాయులే! వారందరిపైనా సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది పది పరీక్షలు విద్యార్థులకే కాదు.. ఉపాధ్యాయులకూ ఎందుకిలా విషమపరీక్షగా తయారయ్యాయి? తరగతి గదుల్లో బోధన, విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారనే అంశాలతో సంబంధం లేకుండా... ఉన్నతాధికారులు ఉత్తీర్ణత విషయంలో లక్ష్యాలు విధిస్తున్నారు. వాటి సాధనకు కొందరు ఉపాధ్యాయులు పక్కదోవ పడుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్ లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. చక్కగా పాఠాలు చెప్పి, విద్యార్థులను సిద్ధం చేయడం కంటే పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ చేయిస్తే సరిపోతుందనే భావన ప్రబలుతోంది. మరోవైపు.. బాగా చదివి మంచి ప్రతిభ చూపాలనుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ గందరగోళంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఎందుకంటే.. పదో తరగతి ఫలితాల ప్రాతిపదికనే ట్రిపుల్ ఐటీలలో సీట్లు వస్తాయి. ఇంటర్ ప్రవేశాల్లోనూ వీటికి ప్రాధాన్యం ఉంటుంది. తాము ఇంత కష్టపడి చదివినా.. నష్టపోతామేమోనన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
సామర్థ్యాలు లేకపోయినా భారీ ఉత్తీర్ణత: అసలు పదోతరగతి విద్యార్థుల్లో ప్రతిభా పాటవాల సంగతి అటుంచి.. కనీస ప్రమాణాలకూ వారు దూరంగా ఉంటున్నారన్నది జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సర్వేల్లో తేలిన మాట. చాలామంది పదో తరగతి విద్యార్థులు ప్రాథమికాంశాలూ చెప్పలేకపోతున్నారని, తప్పులు లేకుండా తెలుగులోనూ రాయలేకపోతున్నారని ఎన్‌సీఈఆర్టీ గుర్తించింది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే పదో తరగతిలో గణితం, సామాన్య శాస్త్రంలో విద్యార్థి సగటు పనితీరు 41% ఉంది. సాంఘిక శాస్త్రం, ఆంగ్లం, తెలుగులో 43%. కానీ, 2019లో పదో తరగతి పరీక్షల్లో మాత్రం ఏకంగా 95% ఉత్తీర్ణులయ్యారు. ఇది ఎలా సాధ్యం? మరోవైపు పదోతరగతిలో ఇంత భారీ ఉత్తీర్ణత ఉన్నా.. ఇంటర్‌కు వచ్చేసరికి అది 65%లోపే ఉంటోంది. దీన్నిబట్టి.. విషయ పరిజ్ఞానం లేకున్నా పరీక్షల్లో మాత్రం ఉత్తీర్ణులు అయిపోతున్న వాస్తవాన్ని, మన పరీక్షా నిర్వహణ తీరుతెన్నులను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
సీసీ కెమెరాల ఏర్పాటుపై అశ్రద్ధ..: గుజరాత్‌లో గత కొన్నేళ్లుగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఆడియో రికార్డింగ్ ఉంటోంది. ఫలితాలు వచ్చేముందు ఫుటేజీలను పరిశీలిస్తారు. ఇక్కడ 2016-18 నుంచి 2019-20 వరకు సగటు ఉత్తీర్ణత 67.56% మాత్రమే. అదే ఏపీలో 93.67%. 2017లో రాష్ట్రంలోని కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అక్కడ ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది.
అనంతపురం జిల్లా యెల్లనూరులో కెమెరాలు ఉన్న గదిలో ఉత్తీర్ణత 54.85% అయితే.. అవి లేని గదిలో 89.45%. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఆ తర్వాత అసలు సీసీ కెమెరాల ఏర్పాటు అంశాన్నే మూలకు పడేశారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, అస్సాం లాంటి రాష్ట్రాలు సైతం పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో ఎందుకు వీటిని పట్టించుకోవడం లేదు? రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే ఖర్చయ్యేది రూ.30 కోట్లేనని అంచనా.
ప్రతిభ లేకుండా లక్ష్యాలా?: విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచి, నాణ్యమైన బోధనతో ఫలితాలు సాధించాల్సి ఉండగా.. ఇవేవీ పట్టించుకోకుండా ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పరీక్షల ముందు సమీక్షల్లో ఫలితాలు రాకపోతే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు, కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో కొందరు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొందరు ఇన్విజిలేటర్లు విద్యార్థుల వద్దకు వెళ్లి.. ‘ఏం సమాధానాలు రాశావు? ఏమైనా కావాలా?’ అని అడుగుతున్నట్లు విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఆంగ్ల భాష పరీక్ష రోజున నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రశ్నపత్రం లీకేజీ, మాస్ కాపీయింగ్ జరగలేదని మంత్రి, అధికారులు ప్రకటించారు. కానీ, పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. దీన్నిబట్టే అధికారుల ప్రకటనల్లో డొల్లతనం బయటపడింది. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నా, ప్రైవేటు వ్యక్తులు వెళ్లే అవకాశం లేకపోయినా ప్రశ్నపత్రాలు బయటకు వచ్చేస్తున్నాయి.. వాట్సప్‌లో తిరుగుతున్నాయి. వాటికి బయటి నుంచి సమాధానాలు రాసి లోపలకు పంపేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పిల్లల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఉన్నాయి.
పరీక్షల వ్యవస్థల్లో మార్పులు రావాలి
- షేక్ సాబ్జీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
‘పదోతరగతి ఫలితాలతో సంబంధం లేదు.. పరీక్షలు మాత్రం కఠినంగా నిర్వహించాలని అధికారులు అనడం లేదు. వందశాతం ఫలితాలు సాధించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది మాస్ కాపీయింగ్‌కు దారితీస్తోంది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడంతో బోధన తగ్గిపోతోంది. లక్ష్యం నిర్దేశించకుండా పరీక్షలు కఠినంగా నిర్వహిస్తే మాస్‌కాపీయింగ్ ఉండదు. కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలతో కుమ్మక్కు కావడంతోనూ ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్నాయి. నీళ్లు, ఇతరత్రా పనులకు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటుచేయడం మానేస్తే లీకేజీ, మాస్‌కాపీయింగ్‌ను నిరోధించవచ్చు.’
మోసపోతోంది తల్లిదండ్రులే
- గుంటుపల్లి శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త
‘గత కొంతకాలంగా మాస్ కాపీయింగ్, మూల్యాంకనంలో అధికంగా మార్కులు వేసే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో విద్యార్థుల స్థితిగతులేంటో తల్లిదండ్రులకు తెలియడం లేదు. వ్యవస్థీకృత మాస్ కాపీయింగ్ వల్ల మోసపోతోంది తల్లిదండ్రులు. నష్టపోతున్నది విద్యార్థులు, దేశ భవిష్యత్తు. మాస్ కాపీయింగ్ ఇలాగే కొనసాగితే మన దేశ పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలి. పరీక్షలు సజావుగా జరిగితే చెట్ల కింద పాఠాలు విన్నవారూ గొప్ప శాస్త్రవేత్తలయ్యారు.’
Source from Eenadu