- ఫలించని నిర్బంధాలు, హెచ్చరికలు
- వెల్లువలా వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
- అడ్డుకోలేక... పక్కకు తప్పుకొన్న పోలీసులు
- బీఆర్టీఎస్ రోడ్డు పొడవునా జన ప్రవాహం
- ఉద్యోగ ఉద్యమాల్లో ఇదే అతి పెద్దది
- సమ్మెకు ముందే వేడి చూపించిన వైనం
- ఎమర్జెన్సీ తర్వాత ప్రభుత్వంపై పెద్ద ఉద్యమం
- వైసీపీ శిబిరంలో కలవరం, కలకలం
- ఇంత వ్యతిరేకత ఉందా’ అనే ఆందోళన
ఎవరొస్తారులే అనుకున్నారు! వచ్చినా ఇక్కడిదాకా రాలేరులే అని తలచారు!ఓ ఐదారొందల మంది వస్తే గొప్ప... ఇట్టే తరలించవచ్చు! అని భావించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి! చూస్తుండగానే జన ప్రవాహం మొదలైంది. పోటు మీద ఉన్న సంద్రంలా కదిలింది. చివరికి... సునామీనే తలపించింది. ‘రివర్స్ పీఆర్సీ’పై ఉద్యోగ, ఉపాధ్యాయులు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ విజయవంతమైంది. బెజవాడలో చేసిన ఉద్యమ గర్జన రాష్ట్రమంతా వినిపించింది. దేశం దృష్టినీ ఆకర్షించింది.
అప్పుడెప్పుడో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఉక్కుపాదాల కింద ఉద్యోగులు తిరగబడ్డారు. ఆ తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ స్థాయిలో ఉద్యమించడం బహుశా ఇదే తొలిసారి. ‘వారు బల ప్రదర్శన చేయాలను కుంటున్నారు’ అని ప్రభుత్వ పెద్దలు ఆక్షేపించగా.. ఉద్యోగులు నిజంగానే బలమేమిటో చూపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరగబోయే సమ్మె ‘తీవ్రత’ను ముందే రుచి చూపించారు. పిడికిళ్లు బిగించి నినదిస్తూ తరలి వస్తున్న వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను అడ్డుకోవడం కుదరదని పోలీసులు గ్రహించారు. బారికేడ్లను పక్కకు తీసి.. ‘ప్రవాహానికి’ దారి విడిచారు. దీంతో.. ‘చలో విజయవాడ’ ప్రశాంతంగా ముగిసింది.
రాజకీయ పార్టీల అండ లేదు. బిర్యానీ ప్యాకెట్లు పంచలేదు. జన సమీకరణ చేయలేదు. ప్రభుత్వ పెద్దలకు ఊతపదమైన ‘పెయిడ్ ఆర్టిస్టులు’ కారు! అందరూ... ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగ, ఉపాధ్యాయులే! వారే పిడికిలి బిగించారు! ‘న్యాయం కావాలి’ అని నినదించారు. పీఆర్సీ ఉద్యమ ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ అటు సర్కారు, ఇటు స్వయంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఊహించని రీతిలో విజయవంతమైంది.
ఇది సర్కారు పెద్దలను ఉలిక్కిపడేలా చేసింది. నిజానికి... బుధవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మోహరించారు. బెజవాడ వైపు వచ్చే వాహనాలను పలు చోట్ల ఆపి తనిఖీ చేసి... ఉద్యోగ, ఉపాధ్యాయులను కిందికి దించేశారు. చివరికి... ‘గురువారం సెలవు మంజూరు చేస్తే మీపై కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్ల ద్వారా అధికారులకు హెచ్చరికలు పంపించారు. ఈ నేపథ్యంలో బెజవాడకు చేరుకునే వారి సంఖ్య మూడంకెల్లోనే ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ... వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
చరిత్రను తిరగరాసేలా...హక్కుల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఆందోళనలు చేయడం కొత్తేమీ కాదు. కానీ... ఇప్పుడు జరిగింది ‘అన్నింటికీ మించి’ అనే స్థాయిలో ఉందని పాత ఉద్యమాలను చూసిన రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983లో ఒకసారి సమ్మె జరిగింది. 1986లో ఏకంగా 53 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ తర్వాత 1989లో ఎన్టీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత... 1994, 2003, 2011, 2014, 2018లోనూ ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగులు స్వల్ప కాలవ్యవధిలో ఆరుసార్లు మెరుపు సమ్మెలు చేశారు. అయితే, అవేవీ మహోగ్రరూపం దాల్చలేదు. ఇప్పుడు... అసలు సమ్మె మొదలుకాకముందే, ‘రిహార్సల్స్’లోనే ఈ స్థాయిలో వేడెక్కడం గమనార్హం. పాపం... సజ్జలప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంచి పేరే ఉంది. మిగతా వారితో పోలిస్తే ఆయన ‘బెటర్’ అనే వారున్నారు. తీరులో స్థిరత్వం, మాటలో మర్యాద, వ్యవహార శైలిలో హుందాతనం... ప్రదర్శిస్తారని సజ్జలకు పేరు. కానీ... పీఆర్సీ వివాదంలో ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయన తన పేరు తానే చెడగొట్టుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.
‘అరెస్టుల దాకా తెచ్చుకోవద్దు, వైషమ్యాలతో ఏమొస్తుంది, చర్చలకు పిలిపిచినా రావడం లేదు, జీతాలు పెరిగాయి, మీ మూడు డిమాండ్లకు కాలం చెల్లింది’... అంటూ సజ్జల చెబుతున్న మాటలతో వారంతా మంటెక్కి ఉన్నారు. ‘చలో విజయవాడ’కు వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీడియా ముందు సజ్జలపై విరుచుకుపడ్డారు. ‘‘ఆయనంటే మాకు గౌరవమే! కానీ... పీఆర్సీతో సలహాదారుకు సంబంధం ఏమిటి? ప్రభుత్వానికి సలహాలు ఇచ్చుకోండి. మాకు కాదు’’ అని మండిపడ్డారు. ఉద్యోగుల ఆందోళనను చాలా తేలికగా తీసుకున్న జగన్ శిబిరం గురువారం నాటి పరిణామాలతో బిత్తరపోయింది. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు సృష్టించినా, అంతగా బెదిరించినా ఈ స్థాయిలో ఉద్యోగులు ఎలా తరలివచ్చారు? ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత వచ్చిందా? అంటూ నేతలు విస్తుపోయినట్లు తెలిసింది. సీఎం జగన్ ముందు ఎవరైనా మౌనంగా ఉండాల్సిందే. ఆయన చెప్పింది వినాల్సిందే. అలాంటిది... ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వాన్ని, సీఎం నిర్ణయాలను తూర్పారపట్టడాన్ని వైసీపీ శిబిరం జీర్ణించుకోలేకపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నయానో భయానో ‘వ్యతిరేక స్వరాలను’ అణచివేయడమే వైసీపీ విధానంగా మారింది. అమరావతి రైతులు మాత్రమే ఈ బెదిరింపులకు తలొగ్గలేదు.
పాదయాత్రను సైతం విజయవంతంగా పూర్తి చేశారు. ప్రొబేషన్‌పై సచివాలయ ఉద్యోగులు గర్జించినప్పటికీ... వారిని బుజ్జగించి లేదా భయపెట్టి రెండు రోజుల్లోనే మౌనం వహించేలా చేశారు. ఇక... ఓటీఎస్, ఆస్తి పన్ను పెంపు, చెత్తపన్ను విధింపు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడం ఇలా అనేక అంశాలపై వ్యతిరేకత గూడుకట్టుకున్నా, అవి ప్రజాందోళనల స్థాయికి చేరలేదు. ఇప్పుడు... తొలిసారిగా ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళన రూపంలో సర్కారుకు సెగ తగిలింది. అమరావతి రైతులు పలు సందర్భాల్లో భారీ కార్యక్రమాలు నిర్వహించినా... ఒక సామాజిక వర్గం, 29 గ్రామాలకే పరిమితం, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేస్తూ, వారిని తేలిగ్గా తీసుకుంటూ వచ్చారు. ఇక... ఇతర ఆందోళనలు జరిగినప్పుడు వారి వెనుక ప్రతిపక్షం ఉందంటూ మరొకరిపై నెపం నెట్టేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. స్వయంగా... ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులే ఆందోళనకు దిగారు. వారిపై పెయిడ్ ఆర్టిస్టుల ముద్ర వేయలేరు. వారేమీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారో, పరిమితమైన ప్రాంతానికి చెందిన వారో కారు!
అడ్డుకోబోయి...‘ చలో విజయవాడ’ను అడ్డుకోవాలని సర్కారు గట్టిగానే భావించింది. దూరం నుంచి ఎలాగూ ఎవరూ రాలేరనే నమ్మకంతో... కృష్ణా జిల్లా నుంచీ ఎవరూ రాకుండా గురువారం చాలావరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేసింది. సభకు అనుమతిలేదంటూ ఎక్కడిక్కడే పోలీసులను ముందుపెట్టి ఉద్యోగులను కట్టడిచేసింది. ‘పోలీసులు వేరు, ఉద్యోగులు వేరు’ అంటూ వారి మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. కానీ... ఇది ఫలించలేదు. ‘పోలీసులూ మా వాళ్లే’ అంటూ ఉద్యోగులు వారితో సఖ్యంగా ఉన్నారు. పోలీసులు కూడా అత్యంత సంయమనంతో వ్యవహరించారు. ‘ఎవరినీరాకుండా చూస్తామని చెప్పిన ప్రభుత్వమే... రెండు వేల మంది పోలీసులను సభా స్థలికి పంపించింది. వాళ్లంతా మా సహోద్యోగులే కదా! అక్కడే మా ఉద్యమ విజయానికి నాంది పడింది’’ అని ఉద్యోగ నేతలు వ్యాఖ్యానించడం కొసమెరుపు!
జగన్ మూడు మారిపోయిందా...‘ఉద్యోగ గర్జన’తో ప్రభుత్వ పెద్దల్లో ఓ మాదిరి కలవరం, కలత కనిపించిందని తెలుస్తోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించే సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌లో ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంటుంది. గురువారం విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ఆయన మూడు మారిపోయిందని, ముభావంగా ఉన్నారని ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం నుంచే ఆయన ముఖకవళికల్లో మార్పు వస్తోందని, ఇప్పుడు ఉద్యోగుల నిరసన సభ చూశాక ముఖంలో హావభావాలను దాచుకోలేకపోయారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఇదీ తేడా చంద్రబాబు ఇచ్చిన పీఆర్సీ బాగా జుట్టు ఉన్న సహచర ఉద్యోగి క్రాఫ్‌లా ఉండగా... ప్రస్తుత సీఎం జగన్ ఇచ్చిన పీఆర్సీ తన బోడి గుండులా ఉందని రెండింటి మధ్య తేడాను ఓ ఉద్యోగి వ్యంగ్యంగా చెప్పారు.