AP CM YS Jagan fire on Chandrababu: ఏపీలో పీఆర్సీ(PRC) రచ్చ ఇంకా తగ్గలేదు. పైగా ఉద్యోగ సంఘాల్లో(Employees Union) చిచ్చురేపడమే కాదు..చీలక కూడా తెచ్చింది. మాకు మేమే వేరు కుంపటి అంటూ కొన్ని సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదనలు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరిస్తే సరిపోతుందా…తమ సమస్యలు సాల్వ్ కాకుండానే ఎలా ఓకే చెబుతారంటూ…ఏపీ జేఏసీ నుంచి కొన్ని సంఘాలు బయటకొచ్చాయి. జేఏసీకి రాజీనామా చేసినట్లు ప్రకటించాయి. .కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులూ(Outsourcing Employees) పీఆర్సీ సాధన సమితి సభ్యులపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
మొదట సీఎంతో పీఆర్సీ సాధన సమితి నేతల మధ్య జరిగిన చర్చలు ఫలించినట్లు.. ఇక సమస్య తీరిపోయిందని ఇరువువైపుల నుంచి ప్రకటనొచ్చింది. ఉద్యోగ సంఘాల్లోని కీలక నేతలు..ప్రభుత్వంపై ప్రంశసలు జల్లు కూడా కురిపించారు. ఉద్యోగులకు అండగా ప్రభుత్వం నిలబడిందంటూ ఆకాశానికెత్తారు. ఇక సీఎం జగన్ కూడా ఉద్యోగులు సహకరించారని…వారు సహాయం లేనిదే ప్రభుత్వం లేదని…అసలీ ప్రభుత్వం వారిదేనంటూ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఇక, ఉద్యోగ సంఘాలు సైతం కష్టకాలంలోనూ తమ డిమాండ్లకు ప్రబుత్వం ఒప్పుకుందని ఆనందం వ్యక్తం చేశారు కూడా…ఐఆర్ విషయంలో అసంతృప్తిగా ఉన్న హెచ్‌ఆర్‌ఏ విషయంలో శ్లాబులు తెలంగాణతో సమానంగా నిర్ణయించడం సంతోషం కలిగించిందన్నారు. అయితే సాధన సమితి సభ్యుల తీరుపై మండిపడుతూ. ఏపీ టీచర్ల సంఘం మరో బండగురిచూసి పడేసింది. మోసం చేశారంటూ పలు చోట్ల ఆందోళనకు దిగారు ఉపాధ్యాయులు. అటు, ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకుని.. తమకు తీరని అన్యాయం చేశారని మండుపడుతున్నాయి ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సంఘాలు. యూనియన్ నేతలు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
అయితే చీకటి ఒప్పందాలన్న నిందారోపణకు ప్రభుత్వం నుంచి సీరియస్ రియాక్షన్ వచ్చింది. ముందు ఓకే అని..తర్వాత మరోలా మాట్లాడటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ విషయంలోనైనా పట్టువిడుపులు ఉండాలంటూ వ్యతిరేకించే సంఘాలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఎదుట ఎర్రజెండా… వెనుక పచ్చజెండా’ అన్న చందంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఎర్రజెండా, పచ్చజెండాలు కలిసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. మంగళవారం ‘జగనన్న చేదోడు’ రెండో ఏడాది నగదు విడుదల కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్.. ‘పేద ఇళ్లను అడ్డుకున్న చంద్రబాబు.. కామ్రేడ్లకు మిత్రుడు. చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు మాత్రమే సమ్మె కావాలి. ఉద్యోగులు సమ్మె విరమించారనగానే కామ్రేడ్లను ముందుకు తోశారు. ఎర్రజెండా వెనుక పచ్చజెండా ఉంది. సీఎంను తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారు. ఉద్యోగులను ఎర్రజెండాలు పచ్చజెండాలు కలిసే రెచ్చగొట్టారు.
ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలని కోరుకుంటారన్న వ్యక్తి చంద్రబాబు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ ఆరోపంచారు. ‘చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతుంటే ఎల్లో మీడియాకు పండుగ. సంధి జరిగింది.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదని వారికి మంట. అందుకే ఉద్యోగులు సమ్మె విరమించగానే కామ్రేడ్లను ముందుకు తోశారు ’ అని సీఎం జగన్ మండిపడ్డారు.
మరోవైపు, జగన్ రెడ్డి పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి ఒక్క సచివాలయం పోస్ట్ లు తప్ప, ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 32 నెలలు కావస్తున్నా.. నేటికి నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకున్న పాపానపోలేదు! అందుకే ఈ నెల 10 న నిరుద్యోగ యువత తమ సమస్యల పరిష్కారం కోరుతూ.. ఉపాధ్యా, పోలీసు, గ్రూప్ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, యువజన సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది జనవరి నెలలో జగన్ రెడ్డి ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీస్తున్నారు. రెండు సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా, నేటికి ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి నోటిషికేషన్లు తక్షణమే జారీ చేయాలని ఏఐఎన్ఎఫ్, ఏఐవైఎఫ్, తెలుగునాడు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.. మరి చూడాలి…ఉద్యోగుల్లో చిచ్చురేపిన పీఆర్సీ అంశం ఏ టర్న్ తీసుకుంటుందో..
టీచర్లపై గురి పెట్టిన ఏపీ సర్కార్.. రేపటి నుంచి..
ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కార్ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇ-హాజరులో టీచర్ల అటెండెన్స్‌ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీపై ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు యోచిస్తున్నాయి. దీంతో టీచర్ల ఆందోళనలపై ఒత్తిడి తీసుకురావాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.