AP employees unions : ఉద్యోగ సంఘాలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం ముగిసింది. ఇకపై మంత్రుల కమిటితో చర్చలు జరిపేది లేదని స్టీరింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. సీఎం జగన్‌తో తప్ప మరెవరితో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందుకొచ్చి ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఛలో విజయవాడ సందర్భంగా నిర్బంధించిన ఉద్యోగులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో తాము ఘర్షణ వాతావరణం కోరుకోవడంలేదన్నారు. గత మూడేళ్లుగా తమ ఆవేదనలు ప్రభుత్వానికి చెప్పాం.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. అవమానపరిచారని స్టీరింగ్ కమిటి పేర్కొంది.
పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వస్తుండగా.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగ సంఘాల నేతలను గృహ నిరంబంధంలో ఉంచారు. ఓవైపు పోలీసులు ఆంక్షలు అమలు చేస్తూ.. పూర్తి స్థాయిలో నిఘా పెట్టినా.. మారు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు తరలి వచ్చారు.
ధర్నా చౌక్ నుంచి బిఆర్‌టిఎస్ రోడ్డు వరకూ భారీ ర్యాలీగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెళ్లారు. అయితే.. ఆందోళనలు, ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగిన ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి.. సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాకపోకలు నిలిపివేశారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో కొందరు ఉద్యోగులు మారు వేషాల్లో విజయవాడ వెళ్లారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఉద్యోగి అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా మారు వేషంలో వెళ్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరికొందరు ఉద్యోగులు కూలీల మాదిరిగా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు వారి కళ్లు గప్పి విజయవాడ చేరుకున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారుల మాదిరిగా ఉద్యోగులు మారు వేషాలు వేసుకుని విజయవాడలో జరిగే కార్యక్రామానికి వెళ్లారు. చివరకు అతి కష్టం మీద బీఆర్‌టీ సెంటర్‌కు చేరుకున్న ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల నేతలు.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఏపీలో ఉద్యోగ సంఘాలు వర్సెస్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న పీఆర్సీ ఫైట్ పీక్స్‌కు చేరుతోంది. కొత్త పీఆర్సీపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ రోడ్డెక్కిన ఉద్యోగులు.. ర్యాలీలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. నాలుగేళ్లుగా ఎదురు చూసిన పీఆర్సీకి సంబంధించిన జీవోలు రావడంతో.. ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్త పీఆర్సీలతో జీతాలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా.., ఎలా పెరుగుతాయో చెప్పాలంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు పెట్టిన ఉద్యోగులు.. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో.. ఈనెల 7నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించినా.. ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్ల సాధన విషయంలో పట్టుదలగా ఉన్నారు. ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకుపోతున్నారు.