- స్కూళ్లలో ప్రార్థన బంద్
- ఆటపాటలకు సెలవు
- కోవిడ్ వ్యాప్తిపై విద్యాశాఖ చర్యలు
- పాఠశాలలను శానిటైజ్ చేయాలని ఆదేశాలు
SOP in Schools
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థులు ఎక్కడా గుమిగూడ కుండా చూసేందుకు పలు సూచనలు చేసింది. అందులో భాగంగా పాఠశాలల్లో రోజూ నిర్వహించే ప్రేయర్ ను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
ప్రార్ధన సమయంలో అన్ని తరగతుల విద్యార్థులు ఒకే చోటకు చేరతారు కాబట్టి వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు అందే వరకు ప్రార్ధనను నిలిపివేయాలని సూచించింది. అలాగే పాఠశాలల్లో స్పోర్ట్స్, గేమ్స్ తరగతులను కూడా ఆపాలని స్పష్టం చేసింది.
పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఒకచోట చేరే కార్యక్రమాలన్నింటినీ కొంతకాలం నిలిపి వేయాలని సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పాఠశాలల ప్రాంగణాలు, తరగతి గదులను గతంలో నిర్వహించినట్లుగా తరచుగా శానిటైజ్ చేయాలని కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశిం చారు.
ఒమిక్రాన్ వైరస్ బారిన విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పడకుండా డీఈవోలు, ఆర్జేడీ లు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆదేశాలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చూడాలని, తరచుగా హ్యాండ్ వాష్ చేసుకునేలా సూచనలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ను అమలు చేయాలని స్పష్టం చేశారు.