Trending

6/trending/recent

PRC 2018 : 'డీఏ’ సొమ్ము మాయం చేసిన పి.ఆర్.సి

  •  ఐఆర్‌ 9 నెలలు ఎక్కువ ఇచ్చారట.. పెండింగ్‌ డీఏలో వాటిలోకి సర్దుబాటు
  •  తగ్గించిన జీతాలు ఫిబ్రవరి నుంచే.. పీఆర్సీ, పెండింగ్‌ డీఏ జీవోల జారీ

కొత్త వేతనాల్లో కోత... పాత డీఏలు ఇవ్వకుండా వాత! ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం రెండు రకాలుగా షాకులు ఇచ్చింది. కొత్త పీఆర్సీతో ఒక్కో ఉద్యోగి వేతనం దాదాపు 20 శాతం తగ్గనున్నట్లు అంచనా. చివరికి... పెండింగ్‌ డీఏల రూపంలో అందాల్సిన 20 శాతం ఆర్థిక ప్రయోజనాలు కూడా కోల్పోతున్నారు. ఐఆర్‌కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చి, హెచ్‌ఆర్‌ఏ తగ్గించి, సీసీఏ ఎత్తేసినా... ‘జీతం తగ్గకుండా చూస్తాం’ అని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. జరిగే నష్టాన్ని పెండింగ్‌ డీఏలతో భర్తీ చేస్తారని ఉద్యోగులు భావిస్తూ వచ్చారు. కానీ... జగన్‌ ప్రభుత్వం ఇక్కడా మోసమే చేసింది. పెండింగ్‌ డీఏలను ఇచ్చినట్టే... మళ్లీ తన ఖాతాలోనే జమ చేసుకుంది.

ఈనెల 7వ తేదీన సీఎం జగన్‌ పీఆర్సీపై మాట్లాడుతూ... 11వ పీఆర్సీని 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలుచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారమే ప్రభుత్వం సోమవారం జీవోలు ఇచ్చింది. ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ 2019 జూలై 1వ తేదీ నుంచి 27 శాతం ఇస్తోంది. అంటే... పీఆర్సీ అ మలు తేదీ (2020 జనవరి 1) కంటే 9 నెలల ముందు నుంచి ఉద్యోగులు 27 శాతం ఐఆర్‌ అందుకుంటున్నారు. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, తీసుకున్న జీతం తిరిగి కట్టమన్నా, ఇకపై ఇచ్చే వేతనంలో మినహాయించుకుంటామన్నా ఉద్యోగులు తిరగబడతారని ప్రభుత్వం భావించినట్టుంది.

అందుకే... ఒక్కొక్కటిగా పేరుకు పోతూ వచ్చిన 5 డీఏల మొత్తాన్ని 9 నెలలు ‘అదనం’గా ఇచ్చిన ఐఆర్‌తో సరిపెడుతున్నట్లుగా లెక్కలు వేసి చెప్పింది. అంటే... పెండింగ్‌ డీఏల రూపంలో ఉద్యోగులకు పైసా రాదు. కొత్త పీఆర్సీ అమలుతో 20 శాతం వేతనం కోల్పోయే ప్రమాదముందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన తీసుకునే జీతంతో ‘తక్కువ’ ఎంతో తేలిపోతుంది. 

ఇక పదేళ్లకోసారే...: ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకో పీఆర్సీ ఉండబోదని జగన్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. కేంద్రం ఇస్తున్న ప్రకారం పదేళ్లకోసారి పీఆర్సీ ఇస్తామని తెలిపింది. కేంద్రం చివరిగా 2016లో తన ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చింది. మళ్లీ 2026లో ఇస్తుంది. ప్రభుత్వం దీనినే ప్రాతిపదికగా తీసుకుంటుందా? లేక... ఇప్పుడు (2022) పీఆర్సీ అమలు చేస్తున్నందున, మరో పదేళ్ల తర్వాత 2032లో పీఆర్సీ ఇస్తుందా... అనే అంశంపై స్పష్టత లేదు.

5 పెండింగ్‌ డీఏలు మంజూరు 2019 జూలై ఒకటో తేదీ నుంచి 2021 డిసెంబరు 31వ తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 5 డీఏలు కలిపి దాదాపు 20 శాతం వరకు ఉన్నాయి. వీటిని 2022 జనవరి జీతాల నుంచి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు వైసీపీ అధికారంలో వచ్చిన కొత్తలో పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను తక్షణమే మంజూరు చేస్తూ జీవోలిచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఆ డీఏలకు సంబంధించి ఉద్యోగులకు పైసా కూడా జీతంతో కలిపి ఇవ్వలేదు. ఈ రెండు డీఏల బకాయి దాదాపు రూ.6,000 కోట్ల వరకు ఉంది. అలాగే, ఉద్యోగుల సొమ్ము పీఎఫ్‌, గ్రాట్యుటీ, ఈఎల్స్‌, ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్‌ ఇతర రూపాల్లో రూ.2,000 కోట్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలంటూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల పీఆర్సీకి సంబంధించి సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలోనూ, అంతకుముందు ఆర్థిక మంత్రి, అధికారులు, సలహాదారులతో జరిగిన సమావేశాల్లోనూ వీటిని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. కానీ, ప్రభుత్వం ఉద్యోగుల మొర ఆలకించలేదు. సీఎం అయితే నేరుగా ఏప్రిల్‌లోనే వీటిని ఇస్తామని చెప్పారు. మార్చితో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఏప్రిల్‌ అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం. అంటే వీటిని ఇంకో 12 నెలలు వాయిదా వేసినట్టే.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad