కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణా లోని విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు అక్కడి ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెలవుల పొడిగింపు ప్రకటనను ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్-TRSMA) తీవ్రంగా ఖండించింది. అవగాహన లేకుండా విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి కోవిడ్ కేసులను పెంచుతున్న వారిని పట్టించుకోకుండా విద్యాసంస్థలను మూసివేయడమేంటని ప్రభుత్వాన్ని ట్రస్మా ప్రశ్నించింది.
తెలంగాణలో సెలవుల పొడిగింపును ఖండించిన ట్రస్మా
మార్కెట్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు, వైన్ షాపులు, బార్లు, పొలిటికల్ సమూహాలకు అనుమతిస్తున్న ప్రభుత్వం.. అవగాహన ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అందించే విద్యాసంస్థలను మూసివేయడం వల్ల పిల్లల చదువులకు ఆటంకం కలుగుతోందని.. ఇది చాలా అన్యాయమని ట్రస్మా నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, సాధుల మధుసూదన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఐవీ రమణారావు పాల్గొన్నారు.